యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతి సౌకర్యాలు లేక దేశ నలు మూలల నుంచి వచ్చే భక్తులు నిత్యం తీవ్ర ఇక్కట్లు పడుతుంటే,ఆలయ ఉన్నతాధికారులకు మాత్రం విశాలమైన,విలాస వంతమైన భవనాలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది.ఆలయానికి భక్తుల వల్లే ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది.
కానీ,వారికి సరైన వసతి, సౌకర్యాలు,విశ్రాంతి గృహాలు లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రాత్రి వేళ స్వామి చెంత నిద్ర చేయాలంటే జాగారం తప్పడం లేదని, ఆలయ పరిసరాల్లో,బస్ ప్రాంగణాలలో ఓపెన్ గా పడుకుంటూ ఇబ్బందులు పడుతుండడం గమనార్హం.
కానీ,ఒక్కొక్క అధికారికి రెండు మూడు వందల మంది విశ్రాంతి తీసుకోడానికి వీలైన ఏసీ భవనాల్లో విధులు నిర్వహిస్తున్నారు.కొండపైన ప్రధాన కార్యలయానికి ఒక భవనం,ఈవోకు ఒక భవనం, ప్రోటోకాల్ కార్యాలయానికి ఒక భవనం నిర్మించారు.
అంతే కాకుండా ఉన్నతమైన పదవుల్లో కొనసాగుతున్న డిఈవో,ఏఈవో,ఏఈ,డిఈలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలయ పునరుద్ధరణలో భాగంగా ప్రత్యేక భవనాలు నిర్మించారు.ఇన్ని కార్యాలయాలు నిర్మించి,భక్తుల కోసం ఏ విధమైన వసతి గృహాలు నిర్మించకపోవడంతో ఆలయ పునరుద్ధరణ భక్తుల కంటే ఆలయ అధికారుల కోసమనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
దేవస్థానంలో ఉన్నతమైన పదవుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల కార్యాలయాలను భక్తుల వసతి గృహాలుగా కేటాయిస్తే ఒక్కో దాంట్లో సుమారు రెండు నుంచి మూడు వందల మంది భక్తులు విశ్రాంతి తీసుకోడానికి వీలుంటుందని భక్తులు అంటున్నారు.కొండపైన ఉన్న డార్మెంటరీ హాల్స్ ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉందని,ఈ డార్మెంటరీ హాల్ లో సరైన గాలి వెలుతురు లేకపోవడం,పక్కనే టాయిలెట్స్ నుండి దుర్వాసన రావడం,రాత్రి తొమ్మిది గంటల తరువాత అందులో ఏసీలు, ఫ్యాన్స్ నిలిపివేయడం వల్ల భక్తులు ఉండాటానికి వీలు లేకుండా పోయిందంటున్నారు.
దీంతో కొండపై నిద్రించి మొక్కులు తీర్చుకునే భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయని వాపోతున్నారు.దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎన్ని అవస్థలు పడుతున్నా పట్టించుకోనే నాథుడే లేడని, ఇదంతా చూస్తుంటే అధికారులకు విలాసాలు, భక్తులకు ఇక్కట్లుగా ఆలయ పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఆలయ ఈవో భాఫ్కర్ రావు స్పందించి కొండపై భక్తుల సౌకర్యార్థం వసతులతో కూడిన వసతి గృహాల సముదాయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.