కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటారు.వ్యాపారం బాగా సాగుతుందనే కారణంతో అలా చేస్తుంటారు.
తాజాగా ఇదే కోవలో ఓ వ్యాపారి సరికొత్త ఆఫర్‌ను ప్రకటించాడు.తన షాపులో మొబైల్ కొంటే రెండు బీర్లు ఫ్రీ అని ఊరంతా పోస్టర్లు అతికించాడు.
అసలే వేసవి కాలం వస్తోంది.చల్లని బీర్ల కోసం పురుషులు ఎగబడ్డారు.
అయితే రోడ్డుపై ఎక్కువగా జనం పోగుబడడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.అసలు విషయం తెలిసి ఆ మొబైల్ షాపు ఓనర్‌ను అరెస్ట్ చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రెండు క్యాన్ల బీరు ఉచితంగా ప్రకటించిన దుకాణదారుని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని చౌరీ రోడ్డులో రద్దీగా ఉండే మార్కెట్లోని మొబైల్ షాపు వద్ద జనం గుమిగూడారు.దీనిపై సిటీ కొత్వాలి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అజయ్ సేథ్ స్పందించారు చౌరీ రోడ్డులోని రెవ్దా పరస్పూర్లోని ఆర్కే మొబైల్ సెంటర్ యజమాని రాజేష్ మౌర్య పోస్టర్లు, కరపత్రాలు, ప్రకటనలు విపరీతంగా ప్రచారం చేశాడన్నారు.
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు బీర్లు ఉచితంగా ఇచ్చేలా ఆఫర్లు ఇచ్చాడన్నారు.
మార్చి 3 నుండి మార్చి 7 వరకు ఈ ఆఫర్ ఉంటుందని ఆయన తన ప్రకటనల్లో పేర్కొన్నాడని వివరించారు.జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా అతడు ప్రచారం చేశాడన్నారు.దీంతో RK మొబైల్ సెంటర్లో కస్టమర్ల రద్దీ పెరిగిందని ఆయన చెప్పారు.
కస్టమర్లకు అందించేందుకు రాజేష్ మౌర్య దుకాణంలో మొబైల్స్‌తో పాటు బీర్లు కూడా ఉంచినట్లు వెల్లడించారు.దీంతో పెద్ద ఎత్తున ఆ షాపునకు కస్టమర్లు వచ్చారని, దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.
దీనిపై సూపరింటెండెంట్ ఆదేశాలతో రాజేష్ మౌర్యను అరెస్ట్ చేశామని తెలిపారు.