మారుతున్న కాల మాన పరిస్ధితులకు అనుగుణంగా విద్యా రంగంలోనూ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఒకప్పుడు మనదేశంలోనే విద్యార్థులు చదువుకుని ఉద్యోగం సంపాదించేవారు.
కానీ ఇప్పుడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది.నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా విదేశాల వైపు మన పిల్లలు పరుగులు పెడుతున్నారు.
అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ వంటి దేశాలకు భారతీయులు చదువుకోవడానికి వెళ్తున్నారు.
తొలుత ధనవంతుల పిల్లలు మాత్రమే ఫారిన్‌లో చదువుకునేందుకు వెళ్లేవారు.
రాను రాను మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా బిడ్డలను విదేశాల్లో చదివించేందుకు సిద్ధపడుతున్నారు.ఈ క్రమంలో కొన్ని విదేశీ యూనివర్సిటీలు తమ దేశం రాకుండానే భారత్‌లోనే విద్యను అందిస్తున్నాయి.
మనదేశంలోని పలు విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకుని అవి ముందుకు సాగుతున్నాయి.ఈ క్రమంలో 49 విదేశీ యూనివర్సిటీలు భారతీయ విద్యాసంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా వున్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) చీఫ్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు.
వీటిలో చాలా వర్సిటీలు ఎంవోయూలను కూడా సిద్దం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది మేలో యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ – విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య విద్యాపరమైన సహకారానికి, మూడు రకాల డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించడానికి అనుమతించింది.ఈ కార్యక్రమం కింద భారత్‌లో 230, విదేశాల్లో 1,256 విదేశీ ఉన్నత విద్యాసంస్థలను యూజీసీ గుర్తించింది.
ఈ విద్యాపరమైన సహకారాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను అదే నెలలో 63 దేశాల భారతీయ రాయబారులను ఇందులో భాగం చేసినట్లు యూజీసీ చీఫ్ తెలిపారు.మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్, హైడెల్‌బర్గ్ యూనివర్శిటీ, ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ విశ్వవిద్యాలయం, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి సంస్థలు పరస్పర సహకారానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ కమిషన్‌ను సంప్రదించిన విదేశీ విశ్వవిద్యాలయాలు.
వీటితో పాటు పారిస్ 1 యూనివర్సిటీ, కజకిస్తాన్‌లోని కరగండా యూనివర్సిటీ, మలేషియాలోని యూనివర్సిటీ మలయా, పోలాండ్‌లోని లాడ్జ్ యూనివర్సిటీ, ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీలు కూడా వున్నాయి
.