టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు.ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన కేసుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇందుకు గానూ నాలుగు స్పై కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.హాల్ లో స్పై కెమెరాలు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుర్తా జేబులో రెండు వాయిస్ రికార్డర్లు ఉన్నట్లు తెలిపారు.ఫామ్ హౌజ్ లో మధ్యాహ్నం 3.05 గంటలకు స్పై కెమెరాలు ఆన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలో మధ్యాహ్నం 3.10 గంటలకు నిందితులతో కలిసి హాల్ లోకి రోహిత్ రెడ్డి వచ్చారన్నారు.సాయంత్రం 4.10 గంటలకు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు వచ్చారని తెలిపారు.సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారన్నారు.
ఈ నేపథ్యంలో మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి చెప్పామన్నారు.
ఆ క్రమంలో ఆయన సిగ్నల్ ఇవ్వగానే లోపలికి వెళ్లామని పోలీసులు పేర్కొన్నారు.ఆడియోలో ఒక్కో ఎమ్మెల్యేకు 50 ఇస్తామన్న సంభాషణ రికార్డ్ అయిందని, ఇదే విధంగా కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డ్ అయిందని సమాచారం.
అదేవిధంగా తుషార్ కు రామచంద్ర భారతి ఫోన్ చేసినట్లు రికార్డైందని తెలిపారు.తెలంగాణకు చెందిన ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్ర భారతి ఎస్ఎంఎస్ పంపారని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను రిమాండ్ నివేదికలో పోలీసులు పొందు పర్చారు.
అంతేకాకుండా 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంతోష్ బీజేపీ పేరుతో ఉన్న నంబర్ కు రామచంద్ర భారతి వాట్సాప్ మెసేజ్ ను పోలీసులు పొందు పరిచారు.
నందుకు సంబంధించిన డైరీలో 50 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.