గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించిన వ్యవహారం ఏపీలో సంచలనం మారిన సంగతి తెలిసిందే. ఆయన బిజెపితో పొత్తు తెగ తెంపులు చేసుకుని టిడిపి తో జతకట్టేందుకు దాదాపు సిద్ధమైపోయారు.
ఇదిలా ఉంటే అంతకంటే ముందుగా విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నారు.అదేరోజు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జనను నిర్వహించారు.
ఈ సందర్భంగా విశాఖ గర్జన లో పాల్గొనేందుకు హాజరైన ఏపీ మంత్రుల పై జనసేనకు చెందిన కొంతమంది కార్యకర్తలు దాడులకు పాల్పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.ఇక ఆ తర్వాత పోలీసులు దాడులకు పాల్పడిన జనసేన కార్యకర్తలను గుర్తించి వారిని అరెస్టు చేశారు.
కోర్టు వారికి రిమాండ్ విధించింది.
అయితే వారిని జనసేనకు చెందిన లీగల్ టీం బెయిల్ బయటకు తీసుకువచ్చింది.
ఈ వ్యవహారంపై సీరియస్ గానే పవన్ ఉన్నారు.ఈ ఘటన తర్వాతనే టిడిపి అధినేత చంద్రబాబు పవన్ తో భేటీ కావడం, అవసరమైతే కలిసి పోరాడుతామంటూ ప్రకటనలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇదిలా ఉంటే బెయిల్ పై విడుదలైన జనసేన కార్యకర్తలను నేరుగా పరామర్శించాలని పవన్ డిసైడ్ అయ్యారట.ఈ మేరకు షెడ్యూల్ కూడా తయారవుతున్నట్టు సమాచారం.
జనసేన కార్యకర్తలు అరెస్ట్ వ్యవహారం పై అప్పట్లోనే పవన్ విశాఖలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించినా, పోలీసులు ఆంక్షలు విధించి వెనక్కి పంపించడంతో, పవన్ అక్కడి నుంచి విజయవాడకు వెళ్ళిపోయారు.అయితే ఇప్పుడు బెయిల్ పై వచ్చిన జనసేన కార్యకర్తలను పరామర్శించడం ద్వారా, అటు ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేసి ఇరుకుని పెట్టడంతో పాటు, జనసేన నాయకులకు భరోసా కల్పించినట్లు అవుతుందని, రాజకీయంగా మైలేజ్ వస్తుందనే ఆలోచనతో పవన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం అమరావతి రైతుల పాదయాత్రకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు.ఆ తర్వాత మళ్లీ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర విశాఖ చేరుకునే సమయంలోనే తన పరామర్శ యాత్రను చేపడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో పవన్ ఉన్నారట.కచ్చితంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్ర విశాఖ చేరుకోగానే అక్కడ వైసీపీ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఆ సమయంలో రాజకీయ వేడి మొదలవుతుందని, అదే సమయంలో తాను కూడా విశాఖలో పరామర్శ యాత్ర చేపడితే జనసేనకు రాజకీయంగా కలిసి వస్తుందనే లెక్కల్లో పవన్ ఈ టూర్ కు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.