ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నిజం కాదేమో అని అనుమానం కలుగుతుందా? ఆ అనుమానమే అక్కర్లేదు.ఈ రోజుల్లో ఆసుపత్రికి వెళ్లాంటేనే భయంతో గుండెపోటు వచ్చే రోజులు వచ్చాయి.జలుబు చేసి ఆసుపత్రికి వెళ్లినా రూ.300 కన్సల్టేషన్ ఫీజులు చెల్లించాల్సిన కలికాలపు రోజుల్లో బతుకుతున్నాం.అంతటితో అయిపోతుందా అంటే అనుమానమే! సంబంధిత పరీక్షలు, మెడిసిన్ వెరసి రూ.వేలల్లో సమర్పించుకోవలసిన దుస్థితి వచ్చింది.ఇలాంటి తరుణంలో కేవలం ఒక్క రూపాయి కన్సల్టేషన్ ఫీజుతో కార్పొరేట్ వైద్యం అందిస్తే ఎలా ఉంటుంది?
DSR , DVR చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన GG చారిటీ హాస్పిటల్ పేదలకు తక్కువ ధరలో మంచి వైద్యాన్ని అందిస్తోంది.ఈ హాస్పిటల్ హైదరాబాద్‌లోని రాంగనగర్‌లో 2022 ఫిబ్రవరిలో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.కన్సల్టేషన్ ఫీజుగా కేవలం ఇక్కడ ఒక్క రూపాయి మాత్రమే.అదే ఈ ఆసుపత్రి ప్రత్యేకత.ఆ ఒక్క రూపాయిని కూడా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హుండీలో వేయాల్సి ఉంటుంది.24 గంటలపాటు వైద్య సేవలు అందిస్తారు.గర్భిణులు, పిల్లలు, ఆర్థో సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు.
ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 18 వైద్యులు ఉన్నారు.కేవలం కన్సల్టెన్సీకి మాత్రమే పరిమితం కాకుండా ల్యాబ్, ఎక్స్‌రే, ఫిజియోథెరపీ, ICU, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలను కూడా అతి తక్కువ ధరకే నిర్వహిస్తున్నారు.అంతేకాకుండా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం, టిఫిన్లు అందిస్తున్నారు.
ఆయూష్, ఆరోగ్య శ్రీ పథకాలు కూడా ఇందులో అమలు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఆసుపత్రికి రోజుకు 200 మంది రోగులు వస్తున్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.కాబట్టి ఒకసారి ఈ హాస్పిటల్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది.