93 ఏళ్ళ వయసు వరకు ఇప్పటి జనరేషన్ బతికి ఉంటే గొప్ప.అలాంటిది ఒకవేళ అదృష్టవశాత్తు ఆ వయస్సుకి చేరుకుంటే అప్పుడు కూడా మీరు కష్టపడగలరా? కష్టం కదూ.ఏదో రోగం రొస్టుతో మంచంమీద మూలుగుతూ వుంటారు.అంతెందుకు 30 తరువాతే ఇప్పుడు అనేకమందికి గ్యాస్ ట్రబుల్స్, కీళ్ల నొప్పులు, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
ఇక ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఒళ్ళు వంగనివాళ్ళు ఇక్కడ ఇంటికొక్కడు ఉంటాడు.ఇలాంటివారు ఆమె కథ వింటే ఆశ్చర్యపోతారు.
ఆ 93 ఏళ్ళ టీచర్ ఆ వయస్సుకి వచ్చినా పాఠాల బోధన ఆపలేదు.ఎందరో విద్యార్థినీవిద్యార్థులను ఉత్తములుగా తీర్చి దిద్దుతోంది.
మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు.అవును, మీరు విన్నది నిజమే.
కాలం ఎంతో విలువైనదని, దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతుంటారు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ.ఆమె ఎవరో తెలుసా? RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం)లో తెలుగు రాష్ట్రాలలో తొలితరం స్వయంసేవక్‌లలో ఒకరుగా పలు బాధ్యతలు నిర్వహించి, వేలాదిమంది సంఘ్ కార్యకర్తలకు స్ఫూర్తి కలిగిస్తూ చివరి వరకు సంఘ కార్యంలో నిమగ్నమైన ఆచార్య చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ధర్మపత్ని ఆమె.
ఆమె ప్రస్తుతం విజయనగరం జిల్లా సెంచూరియన్ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధించడం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు.ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు శాంతమ్మ.ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్టణం.ఆమె 1929 మార్చ్ 8న జన్మించారు.