రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.అయితే, ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
వాస్తవానికి మునోగోడు గడ్డ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.అక్కడ ఇప్పటివరకు ఆరుసార్లు కాంగ్రెస్ గెలిస్తే ఐదు సార్లు కమ్యూనిస్టులు గెలిచారు.
ఎర్రజెండా సపోర్టు కారు పార్టీకే
మునుగోడు కాంగ్రెస్ పార్టీకి ఎలా కంచుకోటనో అలాగే కమ్యూనిస్టు పార్టీకి కూడా.ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అక్కడ ఎర్రన్నల ప్రాబల్యం చాలా ఉంటుంది.
గతంలో వైఎస్సార్ సమయంలోనూ వీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.సీట్లు మార్పిడి చేసుకున్నారు.
తాజాగా మునుగోడులో బీజేపీ తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నందున అతన్ని ఎలాగైన ఓడించాలని టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఆలోచిస్తున్నారు.ఇక కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుంటే.
టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టుల మద్దతు తీసుకుంటోంది.మునుగోడు ఉపఎన్నిక కోసం చండూరులో సీఎం కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు సీపీఐ తరఫున నారాయణ హాజరయ్యారు.
తమ మద్దతును కారు పార్టీకి అందిస్తున్నట్టు సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలిపారు.
మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు ఇప్పటికీ 25వేలకు పై చిలుకు బలమైన ఓటు బ్యాంకు ఉంది.వీరి మద్దతుతో మునుగోడులో కారు పార్టీ గులాబీ జెండా ఎగురవేయాలని చూస్తోంది.అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ బలంగానే ఉంది.
టీఆర్ఎస్,కమ్యూనిస్టులు ఏకమైతే బీజేపీని ఢీకొట్టగలరా? లేదా అనేది తెలియాల్సి ఉంది.కమల దండు మాత్రం బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ధీమాతో ఉంది.
కాగా రాష్ట్రప్రభుత్వం మునుగోడు బైపోల్‌ను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో టీఆర్ఎస్ ఓడితే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పని ఖతం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.