సరైన సమయంలో సరైన రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను మించిన వారు ఉండరు.ఆ వ్యూహాలతోనే, ప్రత్యేక తెలంగాణను సాధించడంతోపాటు , రెండుసార్లు టిఆర్ఎస్ ను అధికారంలోకి వచ్చేలా చేశారు.
ఇక మూడోసారి అధికారాన్ని సంపాదించేందుకు అనేక రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.టిఆర్ఎస్ ను ఢీకొట్టే అంతస్థాయిలో కాంగ్రెస్ బిజెపిలు లేవని మొదట్లో భావించినా, ఇప్పుడు పరిస్థితి మారింది.
అధికారం కోసం కాంగ్రెస్ బిజెపిలు దూకుడుగా ముందుకు వెళుతూ రోజు రోజుకు బలం పెంచుకుంటూ ఉండడం పై ప్రత్యేకంగా కేసిఆర్ దృష్టి పెట్టారు.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిత్యం జనాల్లోకి వెళుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా వ్యవహారాలు చేస్తుండడం తో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు తీవ్రంగా ప్రభావం చూపిస్తారని, టిఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే నిర్ణయానికి వచ్చారు.ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల అధ్యక్షులను నియోజకవర్గానికి పరిమితం చేసే విధంగా కేసీఆర్ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో రేవంత్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ 119 నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది.తమ పార్టీ అభ్యర్థుల తరఫున వారు విస్తృతంగా ప్రచారం చేసేందుకు రాష్ట్రమంతా తిరగడంతో పాటు, తాము అసెంబ్లీ కి పోటీ చేసేందుకు చూస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గాలు ఎంపిక కూడా చేసుకోవడం తో అక్కడ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి రెండు పార్టీల అధ్యక్షులను ఒడించాలి అనే వ్యూహంలో ఉన్నారు.
2014, 2018 ఎన్నికల్లోను కేసీఆర్ ఇదే రకమైన వ్యూహాలు అమలు చేసి సక్సెస్ అయ్యారు.2014లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య జనగాం నుంచి పోటీ చేయగా, టిఆర్ఎస్ నుంచి ముత్తం రెడ్డి యాదగిరి రెడ్డిని పోటీకి దింపారు.దీంతో లక్ష్మయ్య నియోజకవర్గం కే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది.
అయినా ఆయన ఓటమి తప్పలేదు.అలాగే హుజూర్ నగర్ లో ఉత్తంకుమార్ రెడ్డి పై కాసోజు శంకరమ్మ ను, సాగర్ లో జానారెడ్డి పై నోముల నరసింహయ్య ను కేసీఆర్ పోటీకి దించారు.
అయినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 22 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం దక్కింది.ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉత్తంకుమార్ రెడ్డి నియామకం కావడంతో, 2018 ఎన్నికల్లో సైదిరెడ్డిని పోటీకి దింపారు.
దీంతో ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గంలోని ఎక్కువగా ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది.ఇక 2018లో జానారెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్నారని భావించిన కేసీఆర్ టిఆర్ఎస్ నుంచి మళ్ళీ నోముల నరసింహయ్యను పోటీకి దింపారు.
నరసింహ య్య అక్కడ విజయం సాధించారు.అలాగే నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై టిఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డిని పోటీకి దింపడంతో, ఓటమి పాలయ్యారు.తిరిగి భువనగిరి పార్లమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పై పట్నం నరేందర్ రెడ్డిని పోటీకి దించి రేవంత్ ను ఓడించారు.ఇక మళ్ళీ రేవంత్ కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీంతో అక్కడ పట్నం నరేందర్ రెడ్డి , లేకపోతే మరో బలమైన నాయకుడిని పోటీకి దించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.2018 ఎన్నికల్లో బండి సంజయ్ పై టీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ ను పోటీకి దింపడంతో సంజయ్ ఓటమి చెందారు.ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి సంజయ్ గెలుపొందారు.
ఇప్పుడు రేవంత్, సంజయ్ నియోజకవర్గల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దింపి ఆ రెండు పార్టీల అధ్యక్షులు మిగతా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో ప్రచారం కు వెళ్లలేని పరిస్థితి కల్పిస్తే , తమ వ్యూహం సక్సెస్ అవుతుందనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.