ఏపీ తెలంగాణలకు కేంద్రం షాకులు మీద షాకులు ఇస్తూనే ఉంది.ఏపీ విభజన సమయం లో ఇచ్చిన హామీ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచుతారని , ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఆశగా ఎదురు చూస్తున్నాయి.
అయితే తాజాగా ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే ఆలోచన ఏది కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.ఒకవేళ అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
2026 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంపుదల ప్రక్రియ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు రాజ్యాంగంలోని 170 ప్రకారం సెట్ల పెంపు ప్రక్రియ ఉంటుందన్నారు.కేంద్ర మంత్రి క్లారిటీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అని రాజకీయ పార్టీలు ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, ఇప్పుడు ఆ ఆశలు అడియాసలు అయ్యాయి.
విభజన హామీల ప్రకారం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది.ఏపీలో 175 నుంచి 225 స్థానాలు అలాగే తెలంగాణలో 119 నుంచి 153 కు పెరగాల్సి ఉంది.
కానీ ఇప్పట్లో ఆ పెంపు ప్రక్రియ సాధ్యం కాదనే విషయం క్లారిటీ రావడంతో అన్ని రాజకీయ పార్టీలు నిరాశ చెందాయి.
వాస్తవంగా అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయనే ఆలోచనతో అనేక మందిని ఎమ్మెల్యే టికెట్ హామీతో పార్టీలో చేర్చుకున్నారు ఈ విషయంలో టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది.ఇక ఏపీలోనూ టిడిపి, వైసిపి వంటి పార్టీలు ఇదే రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాయి.ఇప్పుడు సీట్ల పెంపు సాధ్యం కాదనే వార్తలతో వారంతా నిరాశ చెందుతున్నారు.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం సానుకూలంగా లేకపోవడం తోనే సీట్ల పెంపు విషయమై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ప్రచారం జరుగుతోంది.