ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర కీలకపాత్ర పోషిస్తుంది.ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు ఉంటాయి.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఉత్తరాంధ్ర పరిధిలోకి వస్తాయి.అయితే ఇటీవల జిల్లాల విభజన తర్వాత మూడు జిల్లాలు కాస్త ఆరు జిల్లాలు అయ్యాయి.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు.ఎక్కువ సార్లు ఆ పార్టీనే ఈ జిల్లాలు ఆదరించిన దాఖలాలు ఉన్నాయి.
తొలిసారి 2019 ఎన్నికల్లో మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని నెత్తిన పెట్టుకున్నారు.దీంతో ఆ పార్టీకి బంపర్ మెజారిటీ సాధ్యమైంది.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఎవరు పాగా వేస్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.ఇప్పటివరకు అధికారం అనుభవించిన నేతలు ఉత్తరాంధ్రకు న్యాయం జరగలేదనే భావన ప్రజల్లో బలంగా ఉండిపోయింది.
పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి ఉంటాయి.ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణకమిటీ కూడా వివరించింది.
వెనుకబడిన ప్రాంతం కాబట్టే రాజకీయాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వలసలు కనిపిస్తుంటాయి.అయితే ఉత్తరాంధ్ర నుంచి కేంద్రమంత్రులుగా పనిచేసిన వాళ్లు చాలామందే ఉన్నారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి పలువురు నేతలు కేంద్రమంత్రులుగా పనిచేసినా ఈ ప్రాంతం వెనుకబడటానికి కారణాలు మాత్రం మిస్టరీగానే ఉన్నాయి.ఇక్కడ బీసీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు.
వాళ్లు ఏ పార్టీని అక్కున చేర్చుకుంటే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
టీడీపీ కంటే వైసీపీ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని గత ఎన్నికల్లో ప్రజలు నమ్మారు.అందుకే వైసీపీకి ఓటేశారు.అయితే ఆ పార్టీతో కూడా తమకు ఒరిగిందేమీ లేదని ఉత్తరాంధ్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ కంటే తామే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు చెప్పుకున్నా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు.అటు ఈసారి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తారో లేదో వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.