వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడానికి వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు.ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
వివిధ పథకాల కింద అందిన లబ్ధి గురించి ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి తమనే గెలిపించాలని కోరుతున్నారు.అయితే కొన్నిచోట్ల ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వైసీపీ నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి.
కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు తమకు ప్రభుత్వ పథకాలు అందలేదని ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.అంతేకాకుండా రోడ్లు బాలేదని, మురుగు నీరు పోవడం లేదని, తాగునీరు అందడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పటిదాకా వస్తున్న ప్రభుత్వ పథకాలను ఎత్తేశారంటూ తమ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.దీంతో ఆయా అంశాలను వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ఇంఛార్జుల దృష్టికి తెస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కీలక భేటీ నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంఛార్జులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు వస్తున్న స్పందన, అక్కడికక్కడే సమస్యల పరిష్కారం వంటి అంశాలను సమీక్షించి మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
అంతేకాకుండా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలు, వారి ఆగ్రహం, అందుకు ప్రజాప్రతినిధులు స్పందించిన తీరుపై ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాసు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.కాగా ఈ ఏడాది మే 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం దాదాపు 8 నెలల పాటు సాగనుంది.
ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పనిసరిగా సచివాలయాల కేంద్రంగా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.నెలలో కనీసం 10 సచివాలయాలను సందర్శించాలని చెప్పారు.