ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు వర్చువల్ పద్ధతిలో ఈ రోజు కొత్త జిల్లాల్లో పరిపాలన ను ప్రారంభించారు.
ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ అనేక రకాల ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్నాయి .ముఖ్యంగా కొన్ని కొన్ని జిల్లాల ఏర్పాటు విషయంలో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.అయినా జగన్ మాత్రం 26 జిల్లాలను ఏర్పాటు చేసి తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేసి చూపించారు.ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు ఈ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించగా, దీనిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబడుతున్నారు.
అసలు ప్రజాభిప్రాయం, ప్రజల సౌకర్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త జిల్లాలను జగన్ ఏర్పాటు చేశారని, వాటిని మళ్లీ పునర్వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన తీసుకుంటుందని పవన్ ప్రకటించారు.ఎప్పటి నుంచో కొత్త జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలను అధ్యయనం కూడా చేయలేదని తప్పుబట్టారు.
పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేయడం వల్ల ప్రజలకు ఏ విధంగా పాలన దగ్గర చేస్తున్నారు అనేది జగన్ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

జిల్లాల ఏర్పాటు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఆందోళన గురించి జనసేన కు సమాచారం అందుతోందని, అందుకే జిల్లాలను పునర్వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ ప్రకటించారు.అంతేకాదు దీనిపై ప్రజా ఉద్యమాలు ఆందోళనలు చేపట్టేందుకు జనసేన సిద్ధమవుతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర తరహాలో యాత్ర చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.కొత్త జిల్లాల ఏర్పాటు విషయం పైన ఆందోళన నిర్వహించి జనసేనకు రాజకీయంగా మైలేజ్ పెంచుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.