తెలంగాణలో ఇప్పటి దాకా ఏ నలుగురు రాజకీయ నాయకులు కలిసి కూర్చున్నా.ఎన్నికలపైనే చర్చ సాగుతోంది.
ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడిపోతారు ? అనే దాని చుట్టూ రాజకీయం రంగులరాట్నంలా తిరుగుతోంది.మళ్లీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తాడా ? ఇతర పార్టీలు గెలుస్తాయా ? అనే సమీకరణాలు జోరుగా సాగుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలపై వాడీవేడీ చర్చలు సాగుతూ వచ్చాయి.ఈవిషయంపై కేసీఆర్ స్వయంగా స్పందించారు.ఏది ఏమైనా.
ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అయితే తెలంగాణలో మాత్రం తమ ప్రభుత్వమే ఉంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఏకంగా మూడు సంస్ధలు వేరువేరుగా చేపట్టిన సర్వేల ద్వారా వచ్చిన నివేదిక ప్రకారం టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకొస్తుందని చెప్పారు.కాగా గతంలో అవసరం మేరకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని చెప్పడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో మాత్రం తమదే ప్రభుత్వం అని చెప్పడం విశేషం.వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయని , ఇందులో 29స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చిందని తెలిపారు.మొత్తంగా 0.3శాతం తేడాతో ఒక స్థానం కోల్పోతున్నట్టు పేర్కొనడం గమనార్హం.
తెలంగాణలో 119 స్థానాలకు గాను 4 స్థానాలు కోల్పోతున్నామని నివేదిక ద్వారా తెలిసిందని, మరో 25 రోజుల్లో ఆ నివేదికను బహిర్గతం చేస్తామని ప్రకటించారు.
ఇదే సమయంలో తాను అవసరం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తానని వ్యాఖ్యనించారు.పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఎనిమిదేండ్లుగా తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు.ఆయన ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుని పని చేయరని చెప్పడం గమనార్హం.అయితే దేశ రాజకీయాలపై పీకేకు అవగాహన ఉందని, ఆ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
తన కోరిక మేరకే పీకే పనిచేస్తున్నారని చెప్పడం గమనార్హం.మొత్తంగా ముందస్తు ఎన్నికలపై సీఎం క్లారిటీ ఇవ్వడంతో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.