జనసేన అప్పుడే పొలిటికల్ హీట్ ఏపీలో మొదలుపెట్టేసింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా, అప్పుడే టికెట్ల కేటాయింపు అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర తో పాటు, ఉభయగోదావరి జిల్లాల్లోని జనసేన ప్రభావం ఎక్కువగా ఉండడం తో ఈ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో జనసేన టికెట్లను దక్కించుకునేందుకు అప్పుడే ఆశావాహలు పోటీ పడుతున్నారు.ఇతర పార్టీల్లో తమకు టికెట్ దక్కే అవకాశం లేదనుకున్న వారితో పాటు, జనసేన లో ఉన్న వారు ఈ ప్రాంతాల్లో టిక్కెట్లు దక్కించుకునేందుకు అప్పుడే అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. కొంతమంది తాము మీ పార్టీలో చేరతామని, ఫలానా నియోజకవర్గం టికెట్ తనకే ఇవ్వాలని స్పష్టమైన హామీ కోరుతున్నారట.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు అనుకున్నంత మేర సానుకూలత లేదు.
మొదట్లో ఆ పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించినా, ఇటీవల కాలంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడం, కోర్టులో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ వస్తుండడం , సంక్షేమ పథకాల విషయంలో జగన్ ప్రభుత్వం పై విమర్శలు రావడం, ఏపీలో అనుకున్న మేరకు అభివృద్ధి చోటు చేసుకోకపోవడం ఇవన్నీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టంగా ప్రభావం చూపిస్తాయని మెజారిటీ నాయకులు నమ్ముతున్నారు.
అందుకే జనసేన నుంచి పోటీ చేస్తే తమకు ఇబ్బంది ఉండదనే అభిప్రాయం లో చాలామంది నాయకులు ఉన్నారట.ముఖ్యంగా కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం వంటి జిల్లాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం లో ప్రభావం తీవ్రంగా ఉండడం, పవన్ అభిమానులు ఎక్కువగా ఉండడంతో, ఈ నియోజకవర్గాలపై జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక జనసేన లో గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలు ఇవే.
పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం, తాడేపల్లి గూడెం,నరసాపురం,కృష్ణ జిల్లాలో కైకలూరు, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం, రాజోలు, కాకినాడ సిటీ, రూరల్, పి.గన్నవరం, ప్రత్తిపాడు, అమలాపురం, విశాఖ జిల్లాలో నాలుగు స్థానాల్లోనూ, గుంటూరు జిల్లాలో పత్తిపాడు తెనాలి, గుంటూరు నగరంలోని రెండు సీట్లపై ఆశావహుల పోటీ ఎక్కువగా ఉందట.ఈ స్థానాల్లో జనసేన తప్పకుండా గెలుస్తుందని అంచనాలు బలంగా ఉండడంతోనే అప్పుడే తమ సీటు కన్ఫర్మ్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట.