ఈ రోజుల్లో తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ డిజిటల్ మ్యాప్‌లు, జీపీఎస్ డివైజ్ లపై ఆధారపడుతున్నారు.ఎందుకంటే వీటి కచ్చితత్వం దాదాపు 99% వరకు ఉంటుంది.
కానీ కొన్ని సందర్భాల్లో వీటిని నమ్ముకుంటే ప్రమాదాల్లో చిక్కుకోక తప్పదు.తాజాగా జరిగిన సంఘటన దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
ఒక డ్రైవర్ జీపీఎస్ ఆధారంగా పర్వత రహదారి పై లారీ నడుపుతూ పెద్ద ప్రమాదంలో పడ్డాడు.జీపీఎస్ చూపించినట్లుగా లారీ డ్రైవింగ్ చేస్తూ చివరికి కొండ అంచున అత్యంత దిగ్భ్రాంతికరమైన స్థితిలో చిక్కుకుపోయాడు.
ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇందులో చైనాలోని 330 అడుగుల కొండపైకి వెళ్లి ప్రమాదకర స్థితిలో వేలాడుతున్న లారీ కనిపించింది.
దీన్ని చూసిన నెటిజనులు తమ గుండె ఆగిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.
పర్వత ప్రాంతాలలో డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదు.
అయితే భారీ వాహనం నడుపుతున్నప్పుడు అటువంటి ప్రాంతాలను క్రాస్ చేయడం మృత్యువుతో చెలగాటమాడినట్లే.కొత్త సంవత్సరం రోజున షాంగ్జీ ప్రావిన్స్‌లోని చాంగ్జీ సిటీలో ఈ లారీ ఘటన చోటు చేసుకుంది.
లారీ డ్రైవర్ తన జీపీఎస్ నావిగేషన్‌ను అనుసరించిన తర్వాత ఇరుకైన, ప్రమాదకరమైన రహదారిపైకి వెళ్లాడు.తీరా దాదాపు కొండ చివరకు వచ్చినాక డ్రైవర్ ఈ విషయాన్ని గ్రహించాడు.
అప్పటికే ఆ లారీ ఒక కొండపై నుంచి 330 అడుగుల నుంచి వేలాడుతోంది.వీడియోలో కనిపించినట్లుగా ఇరుకైన పర్వత రహదారిలో లారీ ప్రయాణించడానికి చాలా పెద్దదైపోయిందని తెలుస్తోంది.
డ్రైవర్ ప్రమాదకరమైన మార్గం నుంచి లారీని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అది అంచుపై నుంచి మరింత జారిందని నివేదికలు తెలిపాయి.అయితే లారీ లోయ వైపుగా ఒరుగుతున్న సమయంలో డ్రైవర్ మిస్టర్ వుగా బయటికి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడని స్థానిక మీడియా తెలిపింది.ఈ లారీ అడ్డంగా నిలిచిపోవడంతో పర్వత రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో మూడు భారీ టోయింగ్ ట్రక్కులు రంగంలోకి దిగాయి.ఎట్టకేలకు ఈ లారీని మూడు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు లాగారు.
అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ దుర్ఘటన నుంచి బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.