వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్పుకోదగిన స్థాయిలో ఏపీకి సహాయ సహకారాలు కేంద్ర అధికార పార్టీ బిజెపి అందించలేదు.అయినా ఎక్కడా అసంతృప్తికి గురి కాకుండా ఏపీ సీఎం జగన్ బీజేపీ విషయంలో సానుకూల వైఖరితోనే ఉంటూ వచ్చారు.
ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా, రాజకీయంగా తాను, తమ పార్టీ విమర్శల పాలవుతున్నా, జగన్ మాత్రం చిరునవ్వుతోనే బిజెపి కి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.పొత్తు పెట్టుకోక పోయినా బీజేపీని మిత్రపక్షంగానే చూస్తున్నారు.
అయితే బిజెపి మాత్రం తమను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడంతో పాటు, తాము కోరిన కోరికలు నెరవేర్చకుండా రాజకీయ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనే విషయాలపై జగన్ లో ఇప్పుడిప్పుడే అంతర్మథనం కలుగుతోంది.

ముఖ్యంగా తాము రాజకీయంగా ఇబ్బందులు పడే అంశాలలో బిజెపి కనీసం స్పందించకపోవడం, జగన్ కు మంట పుట్టిస్తోంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఇప్పటికే జగన్ కేంద్రానికి రెండుసార్లు ఘాటుగానే లేఖ రాశారు.అయినా కేంద్రం స్పందించలేదు.
ఇక తెలంగాణ తో ఏర్పడిన కృష్ణా జలాల వివాదంపైనా అంతే స్థాయిలో లేఖలు రాశారు.దానికి స్పందన లేదు.
ఇక నిత్యం తమను ఇబ్బంది పెడుతూ, ప్రభుత్వ ప్రతిష్ట ప్రతిష్టను మసకబార్చుతున్న నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నా స్పందించకపోవడం, ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు గా వ్యవహరించడం తదితర కారణాలతో బీజేపీపై జగన్ చాలా ఆగ్రహంగానే ఉన్నారు.

ఇవే కాకుండా ఏపీ కి కరోనా కష్ట కాలం లోనూ తగిన ఆర్థిక సహాయం అందించకపోవడం, తదితర అంశాలను గుర్తు చేసుకుంటున్న వైసీపీ ఇక పార్లమెంట్లో బిజెపి తో తాడో పేడో అన్నట్టుగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చింది.అంతే కాదు ఢిల్లీలో విశాఖ ఉక్కు కార్మికులతో కలిసి నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించుకుంది.తమకు బిజెపి అవసరం ఉన్నా , తమతో అవసరం బిజెపికి అంతకంటే ఎక్కువ ఉందనే విషయాన్ని వైసిపి గుర్తు చేసుకుంటోంది.
త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓట్లు చాలా కీలకమే.ఇవే కాకుండా కేంద్రం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైసీపీ ఎంపీల మద్దతు తప్పనిసరిగా కావాల్సిందే.ఆ సందర్భంలో బీజేపీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తే అప్పుడు తమ అవసరం ఏమిటో బిజెపికి తెలిసి వస్తుందనే ఆలోచనలు జగన్ ఉన్నారట.అందుకే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బిజెపి కి ఝలక్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారట.