తెలుగుదేశం పార్టీ 2019 లో ఎందుకు ఓటమి చెందింది అనే విషయంపై ఇప్పటికీ చంద్రబాబు కసరత్తు చేస్తూనే ఉన్నారు.గత ప్రభుత్వంలో స్వీయ తప్పిదాల వల్ల టీడీపీ ఓటమి చెందిందనే విషయాన్ని బాబు గుర్తించారు.
ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరమవడం, అదే సమయంలో వారికి మరింత చేరువయ్యే విధంగా వ్యవహరించలేకపోవడం, ఆ విషయాన్ని గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోవడం ఇవన్నీ తమ ఓటమిలో ఒక భాగంగా బాబు నమ్ముతున్నారు.ఎప్పటి నుంచో టీడీపీకి అండదండగా ఉంటూ వస్తున్న కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు 2019 ఎన్నికల్లో జగన్ వైపుకు వెళ్లిపోవడంపై ఇప్పుడు బాబు సమీక్ష చేపట్టారు.
దీంతో ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగకపోతే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, అధికారం అనేది అందని ద్రాక్షగా మారుతోంది అని బాబు ఆందోళనలో ఉన్నారు.
ఈ మధ్య చేపట్టిన ప్రజా పోరాటాల ద్వారా, తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ ఉత్సాహం పెరగడంతో పాటు, ప్రజల్లో సానుభూతి పెరిగింది అనే విషయాన్ని గ్రహించారు.
ఈ నేపథ్యంలో తమకు దూరమైన కొన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకోవాలని, అలాగే అప్పట్లో సొంత పార్టీ నాయకుల వ్యవహార శైలి కారణంగా ఇతర పార్టీల్లో చేరిపోయిన టీడీపీ నాయకులను తిరిగి మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చి యాక్టివ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా బీసీ, ఎస్సి, ఓటు బ్యాంకులు తిరిగి టీడీపీకి దక్కేలా బాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అప్పటి పరిస్థితిల్లో కొంతమంది పార్టీని వీడి బయటకు వెళ్ళినవారు ఇప్పడు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బాబు నమ్ముతున్నారు.
ప్రధానంగా మీడియా కూడా మొదటి నుంచి తమకు అండదండలు అందిస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా టీడీపీకి సహకరిస్తున్నాయని, ఇవన్నీ లెక్కలు వేసుకునే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అన్ని సామాజిక వర్గాలను మరింత దగ్గర చేసుకుని పార్టీని యాక్టివ్ చేయాలనే విధంగా చంద్రబాబు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.ఇదంతా జరగాలంటే పార్టీ నాయకులు అందరూ, ప్రజా పోరాటాలు చేపట్టి ప్రభుత్వ అవినీతి వ్యవహారాలకు సంబంధించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చి, నిలదీస్తూ ఉండాలని, ప్రభుత్వం పై రాజీ లేని పోరాటం చేయడం ద్వారా, ప్రజలలో మంచి గుర్తింపు వస్తుందని ఆ పార్టీ నాయకులకు నూరిపోస్తున్నారు.అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ లోపాలను గమనిస్తూ, వైసిపి నాయకుల అవినీతి వ్యవహారాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
ఇవన్నీ సమర్థవంతంగా చేయగలిగితే మళ్ళీ జనాల్లో బలం పుంజుకోవచ్చని, వచ్చే ఎన్నికలలో అధికారం దక్కించుకోవచ్చు అనేది చంద్రబాబు ప్లాన్ గా కనిపిస్తోంది.