వైసీపీ ఎంపీ రఘురామ కష్ణంరాజు అరెస్టు వ్యవహారం, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వానికి కలిసొచ్చింది.దానికంటే జరిగిన డ్యామేజ్ పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది.
జాతీయ స్థాయిలో రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.తాజాగా ఆయన కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇది వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వార్తే అయినా, ఈ కేసులో రఘురామకృష్ణంరాజు సిఐడి విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు పేర్కొనడం, అలాగే మీడియా , సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి అంటూ చేసిన సూచనలు వంటివి ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగించే విషయాలే.ఆయనపై రాజద్రోహం కేసులో విచారణ ముమ్మరం చేయడంతో పాటు దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను ప్రభుత్వం వెలికి తీసే పనిలో ఉంది.
ముఖ్యంగా ఆయన ఫోన్ కాల్స్ సంభాషణలు , వాట్సప్ మెసేజ్ లు వంటివి ఇప్పుడు కీలకంగా మారాయి.ఇవన్నీ పక్కన పెడితే దేశవ్యాప్తంగా మాత్రం ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని, సొంత పార్టీ ఎంపీ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపిస్తే కేసుల్లో ఇరికిస్తున్నారు అనే అభిప్రాయమూ జనాల్లోకి వెళ్లిపోయింది.
ఈ వ్యవహారంలో చివరికి ప్రభుత్వం పై చేయి సాధించినా, రఘురామకృష్ణంరాజు పై చేయి సాధించినా, ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం అయితే ఎక్కువగానే ఉంటుంది.ఇక సొంత పార్టీలోనూ ఆహారం పై చర్చ జరుగుతోంది.
అనవసరంగా విషయంలో ప్రభుత్వం ప్రతిష్టకు వెళ్లిందని, వేరే రూట్లో ఆయనను కట్టడి చేసి ఉంటే బాగుండేది అని, ఇలా కేసుల వరకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా అభాసుపాలు కావలసి వచ్చింది అనే అభిప్రాయం సొంత పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది.సిఐడి కస్టడీలో ఆయన్ను కొట్టారు అంటూ టీడీపీ అనుకూల మీడియా లో పెద్ద ఎత్తున కధనాలు రావడం జనాల్లోకి వెళ్లడం వంటి ఎన్నో అంశాలు వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టను కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.

ఇక వైసీపీ లోని ముఖ్య నాయకులతో పాటు, ఉభయ గోదావరి జిల్లాల్లోని క్షత్రియ సామాజిక వర్గం సైతం ఈ విషయంలో వైసీపీ అధిష్టానం దూకుడు పై కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే క్షత్రియ సామాజిక వర్గం ప్రతిష్టను దిగజార్చే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని, ఆయన ఇకపై తాము పట్టించుకోమని క్షత్రియ సామాజిక వర్గం సమావేశంలో కీలక నిర్ణయం వెల్లడించినా, మెజార్టీ క్షత్రియులు మాత్రం రఘురామకృష్ణంరాజు కి తమ మద్దతు అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తూ ఉండడం వంటివి వైసీపీ ఇమేజ్ కు ఇబ్బంది కరంగా మారాయి.