ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 స్థానంలో ఆయన మేనల్లుడు హరీష్ రావు అన్ని వ్యవహారాల్లోనూ చురుగ్గా ఉంటూ, అన్నీ తానై చక్కబెట్టేవారు.పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కేసీఆర్ వెన్నంటే నడుస్తూ, ఆ పార్టీకి ప్రజాదరణ పెంచడం లో తన వంతు పాత్ర ఆయన పోషించేవారు.
ఆ తరువాత టిఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కెసిఆర్ కుమారుడు కేటీఆర్ అన్ని విషయాల్లోనూ కలుగజేసుకోవటం, కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాత్రమే అనే విధంగా వ్యవహరించడంతో టిఆర్ఎస్ లో హరీష్ హవా కాస్త తగ్గింది.కెసిఆర్ స్థాయిలో హరీష్ దాదాపు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పట్టు సంపాదించుకోవడం, ఎన్నో అంశాలు ఆయనకు మరింత క్రేజ్ తీసుకువచ్చాయి.
ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఇక్కడ నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే ఇక్కడ టీఆర్ఎస్ కంటే ప్రతిపక్షాలు బలంగా ఉన్నట్లు అనుమానం రావడం, టిఆర్ఎస్ గెలుపు అంత సులువు కాదనే రిపోర్టులు అందడంతో ఇప్పుడు హరీష్ ను కేసీఆర్ రంగంలోకి దించి, దుబ్బాక నియోజకవర్గం ని మళ్లీ తమ ఖాతాలో వేసుకునేందుకు టిఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది.హరీష్ సైతం నిత్యం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ, పార్టీ నాయకులతోనూ, ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులతోనూ మాట్లాడుతూ, టిఆర్ఎస్ గెలుపునకు డోకా లేకుండా చూసుకుంటున్నారు.
బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ కొద్దిరోజులుగా హరీష్ హడావిడి చేస్తున్నాడు.కేంద్రం వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఇప్పుడు అదే అంశాన్ని హైలెట్ చేస్తూ, బిజెపి ప్రభుత్వం పేదలు రైతుల పక్షపాతి కాదని, ప్రజల నడ్డి విరిచేందుకు ఇటువంటి మీటర్ల విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అని ప్రజల్లో సెంటిమెంటును రగిల్చి టిఆర్ఎస్ విజయానికి ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే దుబ్బాకలో ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సింపతీ ఓట్లు మీదనే ఆశలు పెట్టుకున్నారు.హరీష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మారినట్టుగా కనిపిస్తుండడంతో ఆయన ఆందోళనలో ఉన్నారట.
దుబ్బాకలోని అన్ని ట్రబుల్స్ టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ డీల్ చేస్తుండడంతో టిఆర్ఎస్ అధిష్టానం కాస్త రిలాక్స్ అయినట్టుగా కనిపిస్తోంది.