పంజాబ్ రాష్ట్రం లూథియానా నగరం లఖోవాల్ గ్రామానికి చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి బజాజ్ స్కూటర్ మాదిరి కనిపించే ఓ సృజనాత్మకమైన సైకిల్ తయారు చేసుకున్నాడు.అది నిజంగా సైకిల్ అయినప్పటికీ ముందు నుంచి చూస్తే మాత్రం బజాజ్ చేతక్ స్కూటర్ లాగానే కనిపిస్తోంది.
దీంతో స్థానికులు స్కూటర్ లా కనిపించే సైకిల్ ను చాలా వింతగా చూస్తున్నారు.ఈ సైకిల్ కి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.
కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన హర్మాన్ జ్యోతి సింగ్ స్కూటర్ కావాలని తన తండ్రిని అడిగాడు.కానీ స్కూటర్ కొనిచ్చేంత ఆర్థిక స్తోమత తన తండ్రికి లేకపోవడంతో కొడుకు కోరికను ఎలా తీర్చాలి అని బాగా ఆలోచించారు.
చివరికి ఒక క్రియేటివ్ ఆలోచన అతడి మదిలో తట్టింది.వెంటనే కుమారుడికి ఆ విషయం చెప్పగా అతడు కూడా బాగా సంతోషించి ఓకే చెప్పేసాడు.దీంతో తండ్రి ఒక పాడైపోయిన బజాజ్ చేతక్ స్కూటర్ ని తన ఇంటికి తీసుకొచ్చారు.అయితే ఆ స్కూటర్ ముందు భాగాన్ని సైకిల్ ముందు భాగంలో అమర్చి ‘స్కూటర్ సైకిల్’ ని తానే సొంతంగా తయారు చేసుకున్నాడు హర్మాన్ జ్యోతి సింగ్.
ఇక తన సరికొత్త స్కూటర్ సైకిల్ ని రోడ్డుపై తొక్కుతూ వెళ్తుంటే అందరూ చాలా విచిత్రంగా చూడసాగారు.దీంతో హర్మాన్ జ్యోతి సింగ్ ఒక్కసారిగా తన గ్రామంలో సెలబ్రిటీ అయిపోయాడు.
స్థానికులు హర్మాన్ జ్యోతి సింగ్ స్కూటర్ సైకిల్ నడపడాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా అది తెగ వైరల్ అయింది.