కరోనా కారణంగా నష్టాలలోకి వెళ్ళిపోయినా భారత్ ఆర్ధిక వ్యవస్థకి గట్టి ఊతం అందించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.దేశంలో ఉతత్తి, వ్యవసాయ రంగాలకి పెద్దపీట వేస్తూ దేశీయ ఆర్ధికరంగాన్ని బలోపేతం చేసే దిశగా మొదటి ముందడుగు వేయబోతున్నాం అని మోడీ ప్రకటన చేశారు.
ఇక ఈ ఆర్ధిక ప్యాకేజీ భారత్ పురోభివృద్ధికి పెద్ద అండగా ఉండబోతుంది అనే మాట ఇప్పుడు అన్ని వర్గాల నుంచి వినిపిస్తుంది.ఇప్పుడు ప్రధాని ప్రసంగంపై మన పారిశ్రామిక వేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రధాని ప్రసంగంపై మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో స్పందించారు.ప్రధాని ప్రసంగం అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకుందని అన్నారు.బతికితే చాలనుకునే స్థాయి నుంచి, బలపడే స్థాయికి మారేందుకు అవకాశాన్ని దగ్గర చేసిందని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.
1991లో ఇండియాలో వచ్చిన ఆర్థిక పరివర్తనా ఉద్యమం మరోసారి జరగనుందని, ప్రధాని ప్రసంగం చూసిన తరువాత, తనకు రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.మరో పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ స్పందిస్తూ ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కేవలం చరిత్రాత్మకమే కాదని, భూమి, కార్మికులు, ద్రవ్య లభ్యత, చట్టాలు తదితర ఎన్నో విభాగాలపై దృష్టి సారించిన అధ్భుతమని కొనియాడారు.దీని వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇండియాను వృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లే దిశగా, నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఓ కీలకమైన అడుగు వేసిందని వ్యాఖ్యానించారు.ఇక మోడీ ప్రకటనపై ఆర్ధిక నిపుణులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మోడీ తీసుకున్న ఈ నిర్ణయం దీర్ఘకాల ప్రయోజనాలు అందిస్తుందని.భారత్ బలమైన ఆర్ధిక శక్తిగా ఎదగడానికి బాటలు వేస్తుందని చెబుతున్నారు.
.