మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ కు ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా గట్టి దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ లో ముఖ్య నేతగా ఉంటూ వచ్చిన జ్యోతిరాదిత్య ఉన్నట్టుండి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరిన విషయం విదితమే.
అయితే కాంగ్రెస్ కు గట్టి ఝలక్ ఇచ్చిన సింధియా కు కూడా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అదే రేంజ్ లో ఝలక్ ఇవ్వాలని చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.గతంలో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన కుటుంబసభ్యులపై ఉన్న ఫోర్జరీ కేసును మళ్లీ ఓపెన్ చేసి సింధియా ను టార్గెట్ చేయాలనీ కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది.
అక్కడ ఓ స్థలాన్ని అమ్మిన సందర్భంగా వారు తప్పుడు పత్రాలను సృష్టించారనే కేసు వారిపై 2014లో నమోదవ్వగా ఇప్పటివరకు ఆ కేసును మూసి పెట్టారు.అయితే తాజాగా ఈ కేసును రీ ఓపెన్ చేసి సింధియా తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా ఇరకాటంలో పడేయాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు సమాచారం.
అయితే దీనికి సంబందించిన ఆర్ధిక నేరాల విభాగ అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ కేసు రీ ఓపెన్ చేసిన విషయం నిజమే అంటూ స్పష్టం చేసారు.సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు,అప్పటి లావాదేవీ లో చోటుచేసుకున్న వాస్తవాలను వెలికితీయాలంటూ ఆదేశాలను జారీ చేశామని తెలిపారు.2009లో సింధియాల నుంచి తాను మహల్గావ్ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశానని తన తాజా ఫిర్యాదులో శ్రీవాస్తవ తెలిపారు.అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉన్నదానికంటే 6 వేల చదరపు అడుగులు స్థలం తక్కువగా ఉందని ఆయన చెప్పారు.
తప్పుడు పత్రాలతో తనకు భూమిని అమ్మారని ఆరోపించారు.ఇదే అంశానికి సంబంధించి 2014 మార్చి 26న సింధియాలపై ఆయన తొలిసారి ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపిన అధికారులు 2018లో కేసును క్లోజ్ చేశారు.
ఇప్పుడు మరోసారి ఆయన ఫిర్యాదు చేయడంతో… కేసును మళ్లీ ఓపెన్ చేసినట్టు సదరు అధికారి వెల్లడించారు.
అయితే సింధియా అత్యంత సన్నిహితుడైన పంకజ్ చతుర్వేది మాత్రం రాజకీయ కక్ష లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది అంటూ మండిపడుతున్నారు.గతంలో కేసు నమోదు కాగా సింధియా ఎలాంటి తప్పు చేసిన ఆధారాలు లేకపోవడం తో ఆ కేసును క్లోజ్ చేశారని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగం గానే ఈ కేసును మళ్లీ తిరగదోడుతుంది అంటూ పంకజ్ ఆరోపించారు.