స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెస్తున్నా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గన్ కల్చర్ కారణంగా అమాయకులు బలవుతూనే ఉన్నారు.
ప్రతి రోజూ దేశంలోని ఏదో మూల తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి.గత ఆదివారం ఒక్క రోజే 3 వేరు వేరు ఘటనల్లో మొత్తం 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చికాగోలోని ఎస్ మే స్ట్రీట్ 5700 బ్లాక్‌లోని ఓ ఇంట్లో పార్టీ సందర్భంగా చోటు చేసుకున్న వివాదం కారణంగా కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడగా.
వీరిలో నలుగురి పరిస్ధితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉంది.బాధితులంతా 16 నుంచి 48 ఏళ్ల మధ్య వయసు వారే.
ఈ ఘటన జరిగిన కొద్దిగంటల్లోనే బాల్టీమోర్ డౌన్‌టౌన్‌లో కారులో వచ్చిన ఇద్దరు దుండగులు లాంజ్‌లోకి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారిపై కాల్పులకు దిగారు.ఈ ఘటనలో ఏడుగురు తీవ్రగాయాల పాలయ్యారు.

మరో సంఘటనలో అర్ధరాత్రి దాటిన తర్వాత మిన్నియాపాలిస్‌కు ఉత్తరాన 12 మైళ్ల దూరంలో ఉన్న స్ప్రింగ్ లేక్ పార్క్‌లోని థాయ్‌రెస్టారెంట్ వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు మరణించగా.ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని అనోకా కౌంటీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.వరుస సంఘటనలతో అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.