ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ కదిపిన తేనె తుట్టు ఏపీ మొత్తం అలుముతూనే ఉంది.రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా విడిపోయి మరీ ప్రాంతాల వారీగా తమ వాదనను నాయకులు వినిపిస్తున్నారు.
ఇంకా నాయకుల మధ్య ఈ విషయంలో గందరగోళం పోలేదు.ఇక బీజేపీ నాయకులు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడారు.
బీజేపీ ఎంఎల్సీ సోము వీర్రాజు కూడా జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్దిస్తున్నట్టుగా మాట్లాడారు.తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా దీనిపై స్పందించారు.
అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దు అంటూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు, ప్రజలకు కన్నా లక్ష్మీనారాయణ సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన ,మాట్లాడుతూ సీఎం మారితే రాజధాని మారడం చరిత్రలో ఎక్కడా జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధాని తరలింపు అంటూ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయం తీసుకున్నారంటూ కన్నా విమర్శలు చేశారు.
అసలు అమరావతి రైతు సమస్య కాదని, రాజధాని సమస్య అంటూ కన్నా చెప్పుకొచ్చారు.
తమ డిమాండ్ అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే అని, పరిపాలన వికేంద్రీకరణ కాదని కన్నా చెప్పారు.రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనకు బీజేపీ మద్దతు ఎప్పుడూ ఉంటుందంటూ కన్నా హామీ ఇచ్చారు.
కన్నా కూడా రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేశారా లేక పార్టీ అభిప్రాయంగా చెప్పారా అనేది క్లారిటీ లేదు.