ఏపీలో అసలే అంతంతమాత్రంగా ఉన్న బీజేపీకి త్వరలోనే భారీ షాక్ తగలనుందా ? గత ఎన్నికలకు ముందు…ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున బీజేపీలోకి సీనియర్లు వలస వచ్చేశారు.ఏపీలో బీజేపీ ఎంతో ఎదిగిపోతుందని, ఇక్కడ ఆ పార్టీకి ఫుల్ మైలేజ్ వస్తుందని…ఇక్కడ తమ హవాకు తిరుగు ఉండదని అందరూ అనుకున్నారు.2019 ఎన్నికల నాటికి ఓ రేంజ్లో చక్రం తిప్పవచ్చని చాలా మంది కలలు కన్నారు.
అలా అనుకుని బీజేపీలోకి వచ్చిన వారందరూ ఇప్పుడు కక్కలేక.
మింగలేక అన్నట్టుగా పార్టీలో ఉంటున్నారు.ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ బీజేపీని అస్సలు ఎదగనీయడం లేదన్న భావన ఏపీ బీజేపీ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది.
ఈ క్రమంలో ఏపీ బీజేపీలో ఉన్న పలువురు సీనియర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారట.కాంగ్రెస్ నుంచి బీజేపీలో భవిష్యత్తు ఆశించి ఆ పార్టీలో చేరిన నేతల్లో చాలా మంది ఇప్పుడు వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
సమైక్యాంధ్రలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ చూపులు ఇప్పుడు వైకాపా వైపే ఉన్నాయని తెలుస్తోంది.ఇక మాజీ కేంద్ర మంత్రులు దగ్గుపాటి పురందేశ్వరి, కావూరు సాంబశివరావు లాంటి సీనియర్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ, రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న ఆనందమే కనపడడం లేదు.
అసలు వీరు బీజేపీలో ఉన్నారా ? లేరా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ప్రస్తుతం ఏపీ బీజేపీ చంద్రబాబు, టీడీపీ పిడికిట్లో నలిగిపోతోందన్న చర్చలు ఉండనే ఉన్నాయి.
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు హాస్యాస్పద సమాధానమే ఎదురుకానుంది.ఈ క్రమంలో వీరు టీడీపీలోకి వెళ్లలేరు…కాంగ్రెస్‌కు ఏపీలో కనుచూపు మేరలో ఫ్యూచర్ లేదు.
ఇవన్నీ చూసుకుంటున్న బీజేపీ సీనియర్లు చాలా మంది వైకాపా వైపు చూస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.పవన్ జనసేనకు క్రేజ్ ఉన్నా జనసేనను రాజకీయాల్లో తలపండిన ఈ సీనియర్లు పవన్‌ను ఎంత వరకు నమ్ముతారో చెప్పలేం.
బీజేపీలో సీనియర్లు వైకాపాలో చేరితే వారికి ప్రయారిటీ ఇచ్చేందుకు కూడా జగన్ సుముఖంగానే ఉన్నాడట.వారికి వారు కోరుకున్నట్టుగా ఎంపీ, మరి కొందరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వారికి రెడ్ కార్పెట్ పరిచేందుకు సైతం జగన్ వెనుకాడడం లేదట.2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్న జగన్ కొన్ని త్యాగాలతో పాటు తన పార్టీలో కొందరు సీనియర్లకు సైతం షాక్ ఇచ్చేందుకు వెనుకాడడం లేదు.ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ల కోసం రెడ్ కార్పెట్ వేసినట్టు ఏపీ పాలిటిక్స్‌లో చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఏపీలో బీజేపీ ఎదుగుదల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న సంగతి తెలిసిందే.