యాదాద్రి జిల్లా: రాజాపేట మండల కేంద్రంలోని పారుపల్లి గ్రామ శివారులోని వాగును ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కుడుదుల నగేష్,కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి సందర్శించి పూర్తి కోణంలో పరిశీలించారు.ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన గొంగిడి సునీత ఇప్పటివరకు ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగినా కూడా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు.
గతంలో ఈ వాగు నుండి వచ్చే వరదలకు ఇక్కడ ఉన్నటువంటి పైపులైన్లు తెగిపోయి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడినా ఎమ్మెల్యేకు పట్టకపోవడమే బాధాకరమన్నారు.ఈ వాగు దాటి వివిధ గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని,వేరే గ్రామాల నుండి వెళ్లే క్రమంలో కుర్రారం దోశల వాగులో ఇద్దరు అమ్మాయిలు వాగు ప్రవాహానికి గల్లంతై మృతిచెందారని గుర్తు చేశారు.
ఆ సంఘటన జరిగి సుమారుగా ఆరు మాసాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ వాగుపై వంతెన నిర్మించాలనే ఆలోచన కూడా రాలేదని విమర్శించారు.రెండు నెలల తర్వాత తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగిందని,ఆ చేసినటువంటి నిర్మాణం అకాల వర్షాలు వస్తే వరద ప్రవాహానికి తాత్కాలికంగా నిర్మించిన ఈ పైప్లైన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని అన్నారు.
అనేక ప్రమాదాలకు నిలయంగా మారిన వాగు శాశ్వత పరిష్కారం కోసం వెంటనే శంకుస్థాపన చేసి,నిర్మాణం చేపట్టాలని కోరారు.రాజపేట మండలంలో పారుపల్లి,కుర్రారం, నెమలదూది వెంకటాపురం, పొట్టిమర్రి,బేగంపేట గ్రామాలకు రవాణా సౌకర్యం కోసం వంతెనల నిర్మాణం త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోల్ల కొండల్ రెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బుడిగె పెంటయ్య, నర్సాపురం మాజీ సర్పంచ్ ఉప్పలయ్య గౌడ్,యువజన నాయకులు ఇంజా నరేష్,బల్లా యాదేశ్, పల్లె సంతోష్, బూరుగుపల్లి మాజీ ఉపసర్పంచ్ భయ్య మల్లప్ప,రాజాపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.