అమెరికాలో భారత రాయబారిగా నియమితులైన వినయ్ మోహన్ క్వాత్రా( Vinay Mohan Kwatra ) సోమవారం అగ్రరాజ్య రాజధాని వాషింగ్టన్‌కు చేరుకున్నారు.61 ఏళ్ల క్వాత్రా మొన్నటి వరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.ఆయన రాకపై ఛార్జ్ డీ అఫైర్స్ శ్రీప్రియ రంగనాథన్ ( Sripriya Ranganathan )ఎక్స్‌లో ట్వీట్ చేశారు.అమెరికాలో కొత్త రాయబారిగా నియమితులైన క్వాత్రాకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు.
తామంతా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు శ్రీప్రియ పేర్కొన్నారు.
గ్రేటర్ వాషింగ్టన్ డీసీ ప్రాంతానికి చెందిన ప్రముఖ భారతీయ అమెరికన్ల బృందం వినయ్ మోహన్‌కు స్వాగతం పలికేందుకు డల్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ( Dallas International Airport )తరలివచ్చారు.అయితే దురదృష్టవశాత్తూ వారు అతనిని కలవలేకపోయారు.గతంలో ఇక్కడి భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య మంత్రిగా పనిచేసిన క్వాత్రా.
త్వరలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసి తన నియామక పత్రాలను అందజేయనున్నారు.వినయ్ మోహన్ గతంలో ఫ్రాన్స్, నేపాల్‌లలో భారత రాయబారిగా వ్యవహరించారు.
ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు.ఈ ఏడాది జూలై 14న ఫారిన్ సర్వీస్ నుంచి వినయ్ మోహన్ పదవీ విరమణ చేశారు.
గతంలో రాయబారిగా ఉన్న తరంజిత్ సింగ్ సంధు ( Taranjit Singh Sandhu )జనవరిలో పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో వినయ్‌ని నియమించారు.ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను అంచనా వేయడం, కొత్తగా కొలువుదీరబోయే ఫెడరల్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటం క్వాత్రా ముందున్న పెద్ద పని.ఈ ఏడాది చివరిలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వస్తారని భావిస్తున్నారు.సిఖ్ ఫర్ జస్టిస్ నేత, ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఇరుదేశాల మధ్య విభేదాలు, మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ సమావేశం, భారతదేశంలో మానవ హక్కుల స్ధితిపై అమెరికా వైఖరి తదితర అంశాలను వినయ్ క్వాత్రా చక్కబెట్టాల్సి ఉంది.