ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.వాస్తవానికి ఉక్రెయిన్ ను పుతిన్ దేశం చాలా ఈజీగా జయిస్తుందని మొదట అందరూ అనుకున్నారు.
కానీ ఆ అంచనాలన్నీ ఇప్పుడు తలకిందులయ్యాయి.ఇందుకు కారణం ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా రష్యా దళాలతో పోరాటానికి దిగడమేనని చెప్పవచ్చు.
ముఖ్యంగా అక్కడి సెలబ్రిటీలు సైతం యుద్ధంలో పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు.ఇందులో భాగంగా తాజాగా ఒక ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ గన్ చేతపట్టి రష్యన్ సేనల గుండెల్లో గుబులు రేపుతున్నాడు.
ఈ స్టార్ ప్లేయర్ పేరు సెర్గీ స్టాకోస్కీ.ఈ ప్లేయర్ 2013 వింబుల్డన్‌లో రోజర్ ఫెదరర్‌ను చిత్తుగా ఓడించి బాగా పాపులర్ అయ్యాడు.
అలాంటి గొప్ప ప్లేయర్ ఇప్పుడు దేశ రక్షణలో భాగంగా ఆర్మీ అవతారమెత్తాడు.స్వదేశాన్ని కాపాడేందుకు అతడు తనకిష్టమైన టెన్నిస్ ఆటకు సైతం రాజీనామా ప్రకటించాడు.ఆ తర్వాత తుపాకీని పట్టుకొని రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నాడు.ప్రస్తుతం ఈ ప్లేయర్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా తుపాకీని పట్టుకుని కీవ్ వీధుల్లో తిరుగుతున్న సెర్గీ స్టాకోస్కీ ఫొటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది.చాలా మంది నెటిజన్లు సెర్గీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఈ స్టార్ ప్లేయర్ ఉక్రెయిన్ దేశాన్ని వదిలి వెళ్లటం పెద్ద కష్టమేమీ కాదు.కానీ మాతృభూమి కోసం అతడు తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాడు.కుటుంబాన్ని సురక్షితమైన ప్రదేశానికి తరలించి తాను మాత్రం రణరంగంలో పోరాడుతున్నాడు.