యాదాద్రి జిల్లా:భువనగిరి పట్టణంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల వార్డుల్లో అధికార టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పర్యటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని,పేద ప్రజల చెవిలో గులాబీ పూలు పెట్టేందుకే పర్యటనలు చేస్తున్నారని మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మండిపడ్డారు.శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 22వ వార్డులోని ఇందిరానగర్,న్యూరాంనగర్,పోచమ్మవాడ ప్రాంతాల్లో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలుపుతూ పర్యటించారు.
వార్డులో శిధిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంక్,కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు.అనంతరం నిర్వహించిన వార్డు సభలో వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పేద ప్రజల చెవిలో పువ్వులు పెట్టే విధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల వార్డు పర్యటనలు ఉన్నాయని ధ్వజమెత్తారు.22 వ,వార్డులో గత 8 ఏళ్ల నుండి అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ,స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈవార్డుకు ఏం అభివృద్ధి చేశారో బహిరంగంగా వార్డు ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు సమాధానం చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు.ఎస్సీ కాలనీకి చెందిన పేద ప్రజలు మంచి నీళ్ల కోసం వినియోగిస్తున్న నీళ్ల ట్యాంక్ ను కనీసం పరిశుభ్రంగా వుంచలేని దుస్థితిలో టీఆర్ఎస్ మున్సిపల్ పాలకవర్గం ఉన్నదని,అలాగే పురాతనమైన కమ్యూనిటీ హాల్ శిధిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలిపోతుందోనని ప్రజలు భయాందోళన చెందుతుంటే కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం చేయలేని దుస్థితిలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపించారు.
సొంత ఇండ్లు లేక చాలా మంది పేద ప్రజలు అద్దె ఇళ్లల్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని,ఇండ్లకు అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఎంతోమంది పేద ప్రజలు ఈవార్డులో ఉన్నారని,వెంటనే వాళ్లకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలని,అలాగే వితంతువులకు,వృద్ధులకు,వికలాంగులకు, ఒంటరి స్త్రీలకు గత ఎనిమిది సంవత్సరాల నుండి ఒక్క నూతన పెన్షన్ ఇవ్వకపోవడంతో ఎంతోమంది ప్రజలు ఆవేదనతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారం చేతిలో పెట్టుకొని ఊరికే పర్యటనలు చేయడం కాదని,చిత్తశుద్ధి ఉంటే అర్హులైన వారందరికీ వెంటనే ఆసరా పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు.
వార్డులో కొన్ని ప్రాంతాల్లో మురికి కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని,వెంటనే మురికి కాలువల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం కొరకు వార్డును అభివృద్ధి పరిచేందుకు 50 లక్షల రూపాయలను నిధులను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పడిగెల ప్రదీప్, సలావుద్దీన్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజు,ముత్యాల మనోజ్,22 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయపాక స్వామి,బట్టు మహేందర్,మంద భాస్కర్,ఎర్ర భిక్షపతి,క్రాంతి, ఫయాజ్,పడిగెల అనిల్,పడిగెల మనీష్,బర్రె శ్రీధర్, పల్లె నవీన్,ఎడ్ల భరత్,దాసరి మధు,కసరబోయిన సాయి,ఎడ్ల హరి,ఎర్రవెల్లి రమేష్,భాను,రాము, ప్రణయ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.