ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ లోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా మారిపోయారు మంత్రి హరీష్ రావు.కేసీఆర్ మేనల్లుడు గా మొదటినుంచి చక్రం తిప్పిన హరీష్ రావు కు ఆ స్థాయిలోనే కెసిఆర్ ప్రాధాన్యం ఇస్తూ వచ్చేవారు.
కేసీఆర్ తర్వాత హరీష్ రావు మాత్రమే టీఆర్ఎస్ లో అగ్రనేతగా కనిపించేవారు.అయితే అనూహ్యంగా కేటీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం , మంత్రి అవడం వంటి పరిణామాలతో హరీష్ ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది.
ఈ వ్యవహారంపై హరీష్ అసంతృప్తితో ఉండగానే రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టడంతో తెలంగాణలో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
అయితే ముందు ముందు ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపించడంతో ఆయనకు ఆర్థిక మంత్రిగా కేసీఆర్ అవకాశం కల్పించారు.
పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ కు మంత్రి పదవి ఇచ్చినా ప్రాధాన్యం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటూ వచ్చింది.అయితే అనూహ్యంగా ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఉప ఎన్నికలకు నాలుగైదు నెలలు సమయం ఉన్నా, ఇప్పటి నుంచే అన్ని రకాలుగానూ టిఆర్ఎస్ సిద్ధమవుతోంది.ఈ బాధ్యతలను హరీష్ రావు కు కేసీఆర్ అప్పగించారు.

తనదైన శైలిలో హరీష్ రావు మంతనాలు చేస్తూ , పార్టీ నుంచి ఎవరు ఈటెల వైపు వెళ్ళకుండా చూసుకుంటున్నారు.ఇంత చేస్తున్నా హరీష్ పై ఎక్కడో ఏదో అనుమానం కేసీఆర్ కు ఉన్నట్టుగానే కనిపిస్తోంది.అందుకే హరీష్ కదలికలపై నిఘా పెట్టారనే ప్రచారం ఇప్పుడు కలకలం రేపుతోంది.ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా హరీష్ ఎప్పుడు ఎప్పుడు ఎవరెవరిని కలుస్తున్నారు అనే విషయాలపై ఆరా తీసుకున్నారట.
హుజురాబాద్ లో నిజంగానే హరీష్ టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే అనేక అంశాలపై ఆరా తీస్తున్నట్లుు సమాచారం.ప్రస్తుతానికి హరీష్ కు టిఆర్ఎస్ లో ప్రాధాన్యం పెరిగినా, అంతే స్థాయిలో అనుమానాలు ఉన్నట్టుగా వ్యవహారాలు కనిపిస్తున్నాయి.