తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచడం, తెలంగాణతో పాటు , దేశ రాజకీయాలలోను బీఆర్ఎస్ ప్రభావం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వంటి విషయాలను కేంద్ర అధికార పార్టీ బిజెపి చాలా నిశితంగా గమనిస్తోంది.చాప కింద నీరులా కేసీఆర్ దేశమంతట టిఆర్ఎస్ విస్తరించినందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ఆ ప్రభావం తమ పడకుండా చూసుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.
అందుకే ముందుగా తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడం ద్వారా దేశ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం ఉండబోదు అనే సంకేతాలను ఇవ్వాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు పూర్తిగా ఛాన్స్ ఇచ్చారు.తెలంగాణ అంతటా బిజెపిని బలోపేతం చేసేందుకు బిజెపి అగ్ర నేతలతో పాటు , కేంద్ర మంత్రులు తరచుగా తెలంగాణకు వస్తున్నారు.
దీంతో పాటు తెలంగాణలో బలహీనంగా ఉన్న ప్రాంతాల పైన పట్టు సాధించేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.దీంతో ఆయా జిల్లాల్లో జనాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ లోటును తీర్చుకోవచ్చని లెక్కలు వేస్తోంది.
ఇప్పటికే నల్గొండ జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజెపిలో చేర్చుకున్నారు.అక్కడ ఆయన ఉప ఎన్నికల్లో ఓటమి చెందినా, చాలావరకు ఓటు బ్యాంకును సాధించగలిగారు.ఇక ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పై బిజెపి దృష్టి సారించింది.ఈ జిల్లాలో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలో చేర్చుకోవడం ద్వారా, బీఆర్ఎస్ కు చెక్ పెట్టవచ్చనే లెక్కలు వేసుకుంటుంది.
బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరుతారని అంతా భావించినా, ఆది జరగలేదు.వచ్చే నెలలో ఆయన చేరుతారని ప్రచారం జరుగుతుంది.
తేదీ ఎప్పుడైనా బిజెపిలో పొంగులేటి చేరడం మాత్రం పక్కా అని తేలిపోయింది.ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పొంగులేటికి సెక్యూరిటీని తగ్గించడంతో బీఆర్ఎస్ అధిష్టానం పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దీనికి తగ్గట్లుగానే ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఎక్కడ పొంగులేటి కి సంబంధించిన ఫ్లెక్సీలు కనిపించలేదు.దీంతో ఆయన బిజెపిలో చేరతారని బీఆర్ఎస్ దాదాపుగా ఫిక్స్ అయిపోయింది.
కేసీఆర్ కు షాక్ ఇచ్చే విధంగా పొంగులేటిని పార్టీలో చేర్చుకోవాలని భావించినా దానిని వాయిదా వేశారు.బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఖమ్మం సభకు తీసుకొచ్చి ఆ సభను హైలెట్ చేసుకోవడంతో, అంతకంటే గొప్పగా ఖమ్మంలో బిజెపి సభను నిర్వహించి అప్పుడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, పెద్ద ఎత్తున ఆయన అనుచర గణాన్ని పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనే ఆలోచనతో బీజేపీ అగ్రనేతలు ఉన్నారట.అందుకే పొంగులేటి చేరిక ఆలస్యం అయినట్టు సమాచారం.