ఖమ్మం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ రాంబాబు సస్పెండ్ అయ్యారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వైరా నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటు పడింది.
ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 14వ తేదీన వైరాలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వేడుకల కోసం కొణిజర్ల, వైరా, కారేపల్లి, ఏన్కూరుతో పాటు జూలూరుపాడు మండలాల్లోని పీహెచ్ సీ డాక్టర్లు, ఏఎన్ఎంలతో పాటు సిబ్బంది వద్ద డిప్యూటీ డీఎంహెచ్ఓ లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి.ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ మాలతి విచారణ జరిపారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ అక్రమ వసూళ్లకు పాల్పడిన విషయం నిజమేనని తేలడంతో రాంబాబును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.