తెలంగాణాలో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన పార్టీలన్నీ రకరకాల హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారు.ఒక పార్టీకి పోటీగా మరో పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించి ప్రజల ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముందుగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించగా ఇప్పుడు టీఆర్ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటించింది.ఏవైతే సాధ్యం కావని చెప్పిన కాంగ్రెస్ హామీల తరహాలోనే కేసీఆర్ సైతం హామీలు గుప్పించారు.
ఎన్నికలంటే తమకు నిర్ధేషిత లక్ష్యమని చెబుతూ ఆ లక్ష్యాన్ని చేరేందుకే హామీలు అన్నట్లుగా ప్రకటించారు.అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు హామీలతో పాక్షిక మేనిఫెస్టోను రూపొందించారు.

దామోదర రాజనర్సింహ్మ ఆధ్యక్షతన కమిటీ వేసి మేనిఫెస్టో రూపిందించే పని పెట్టుకుంది.అయితే, మేనిఫెస్టోకు తుది రూపు కూడా రాకముందే ఉత్తమ్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారు మేనిఫెస్టోలో ఉన్న హామీలను ఎటువంటి హడావుడి లేకుండానే బయటపెట్టేశారు.దీంతో అవి ప్రజల్లోకి కూడా అంతగా వెళ్లలేదు.కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా పింఛన్ల రెట్టింపు, నిరుద్యోగ భృతి, రుణమాఫి వంటి అంశాలు ప్రధానమైనవి.అయితే, ఇవి ఆచరణ సాధ్యం కాదని కేసీఆర్, కేటీఆర్ వంటి వారు తేల్చేశారు.
అవే హామీలను ఇప్పుడుడ కేసీఆర్ కూడా ఇచ్చారు.
అయితే, ఇలా వరాలజల్లు కురిపించడం వెనక టీఆర్ఎస్ కు ఓటమి భయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.మన మేనిఫెస్టోనే మక్కీ కి మక్కీ కేసీఆర్ ప్రకటించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అయితే, అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోకు తుదిరూపే రాలేదని, తామెలా కాపీ కొడతామని టీఆర్ఎస్ నేతల వాదన.కాంగ్రెస్ మేనిఫెస్టోకు తుదిరూపు రాకున్నా, అధికారికంగా ప్రకటించకున్నా.
నేతలు అత్యుత్యాహంతో అన్నీ బయటకు చెప్పేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ చిక్కుల్లో పడింది.టీఆర్ఎస్ హామీలకు మించి ఇవ్వాలని భావిస్తోంది.

ఇక కేసీఆర్ ఈ భారీ హామీలు ప్రకటించడం వెనుక కారణం మాత్రం బలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ ముందు నుంచీ ఊహిస్తున్నట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవని, గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలైన దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్యుత్ వంటివి నెరవేరకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టీఆర్ఎస్ కు నివేదికలు అందాయట.అందుకే ముందు జాగ్రత్తగా అమలు సాధ్యం కాదని కేసీఆర్ విమర్శించిన పథకాలనే ఇప్పుడు టీఆర్ఎస్ తన పాక్షిక మ్యానిఫెస్టోలో పెట్టింది.పూర్తిస్థాయి మ్యానిఫెస్టోలో మరిన్ని భారీ పధకాలను రూపొందించేందుకు టీఆర్ఎస్ సిద్ధం అవుతోంది.