టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ మధ్యకాలంలో జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేపడుతున్నారు.ఈ సందర్భంగా రోడ్ షోలు నిర్వహిస్తూ, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగాలు ఇస్తూ .
వారిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు.దీనిలో భాగంగానే కందుకూరులోనూ చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.
అయితే ఊహించని విధంగా అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలు మరణించడం విషాదాన్ని నింపింది.అయితే ఈ తొక్కిసలాట చోటు చేసుకోవడానికి కారణం చంద్రబాబు రోడ్ షోను ఇరుకు సందుల్లో ఏర్పాటు చేయడమే అసలు కారణమట.
చంద్రబాబు దృష్టిలో పడేందుకు స్థానిక టిడిపి నాయకత్వం ప్రయత్నించడం, భారీగా జనాలను సమీకరించలేక పల్లెల నుంచి తాము తరలించిన జనాల్ని ఎక్కువమంది గా చూపించేందుకు, బాబు రోడ్ షో భారీగా జనాల మధ్య సాగేలా చేయడం ద్వారా, మీడియాలో ఎక్కువమంది జనాలు ఉన్నట్లుగా చూపించేందుకు ఈ విధంగా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
ఈ కారణంగానే ఏడుగురు టిడిపి కార్యకర్తలు మృతి చెందారట.
కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ రోడ్డు ఇప్పటికే చాలా వరకు ఆక్రమణకు గురికాగా , చంద్రబాబుకు స్వాగతం చెబుతూ భారీగా ఫ్లెక్సీలను రోడ్డు పైనే ఏర్పాటు చేశారు మరోవైపు రోడ్డుపైనే అనేక ద్విచక్ర వాహనాలను నిలిపి ఉంచారు.
దీంతో రోడ్డు మరింత ఇరుకుగా ఆ సమయంలో మారింది.కందుకూరు టిడిపి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఇంటూరి రాజేష్, ఇంటూరి నాగేశ్వరరావు లు పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ముందుకు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇరుకైన రోడ్లలో చంద్రబాబును చూసేందుకు కార్యకర్తలు ఎగబడడం, ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించడం, ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.అదే చంద్రబాబు సభను ఏ బహిరంగ ప్రదేశంలోనో నిర్వహించి ఉంటే ఈ ఘటన చోటు చేసుకుని ఉండేది కాదు.ఇరుకైన రోడ్డులో చంద్రబాబు రోడ్ షోను ఏర్పాటు చేయడమే టిడిపి కార్యకర్తలు మృతికి కారణమైందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.