ప్రజల చేత ఏర్పాటు చేయబడి, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహాం లింకన్.మనది సర్వ స్వతంత్ర దేశం.‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక’ మని మన రాజ్యాంగంలో మనమే చెప్పుకున్నాం.సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమని, అందరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు వుండాలని రాసుకున్నాం.
వ్యక్తులు లేనిదే సమాజం లేదు.సమాజంలో అంతర్భాగం కాకుండా ఏ వ్యక్తీ విడిగా మనుగడ సాగించనూలేడు.
ఎంత ప్రజాస్వామ్య దేశంలోనైనా నూటికి నూరుశాతం ఏకాభిప్రాయాన్ని ఆశించలేం.మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి అందరూ అమలు చేయడం ప్రజాస్వామ్యంలో అనుసరించాల్సిన పద్ధతి.
ప్రశ్నించలేని సమాజాన్ని మనం ప్రజాస్వామ్యమని ఎంతమాత్రమూ అనలేము.ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావించే భారతదేశంలో ప్రజాస్వామ్యం దారుణంగా నలిగిపోతోంది.‘ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్‘ ప్రచురించిన ప్రజాస్వామ్య సూచీలో భారత్ 53వ స్థానానికి పడిపోయింది.2014లో 27వ స్థానంలో వున్న భారత్‌లో, ఈ ఏడేళ్ల కాలంలో ప్రజాస్వామ్యం సగానికి సగం పడిపోవడం ఆందోళనకరం.
దేశంలో ప్రజల ఆందోళనకు బలమైన స్వరాన్ని ఇచ్చే నాయకులు, పార్టీలు, ప్రజలు, మేధావులు, ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యమే నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఎల్లపుడూ పొంచి ఉంటుంది.భారత రాజ్యాంగ రక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశ సమాఖ్య – సమైక్య స్ఫూర్తిని నిలపడానికి, ముఖ్యంగా “ప్రజల” కోసం, ఎల్లప్పుడూ ప్రశ్నించే మేధావులు, ప్రజా-పక్షాలు, ప్రతిపక్షాలు ఎప్పటికీ ప్రధానమైన, ప్రాణాధారమైన అవసరాలు.
మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఎందరో అసమ్మతి వాదులు, హింసావాదులు ఉన్నప్పటికీ అందర్నీ కలుపుకునే ఉద్యమ స్పూర్తితో సమర్థవంతమైన నాయకత్వం వహించడం వల్ల అది ప్రధానంగా రాజకీయ పోరాటం కాగలిగింది, దేశాన్ని బానిస బంధాల నుండి విముక్తం చేయగలిగింది.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు , ప్రజాపక్షాలు ప్రశ్నించాలి.
నిజమైన నాయకులు సర్వసమ్మతి పొందేలాగా కృషి చేయాలి, సమాధాన పరచాలి, ఒప్పించాలి, మెప్పించాలి .అదే నాయకత్వ లక్షణం.
ఎక్కడ నిర్మాణాత్మక ప్రతిపక్ష – అధికారపక్ష సమ్మేళనం ఉంటే అక్కడ ప్రజాస్వామ్యానికీ, ప్రజలకూ, సమాఖ్య వ్యవస్థకూ ఎంతో మేలు జరుగుతుంది.అధికార పార్టీ చర్యలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే, మంచి పథకాలు, కార్యక్రమాలకి ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలి.
అయితే, ప్రతిపక్షాలపై ప్రభుత్వం కూడా ఆధారాలు లేకుండా విద్వేషాలతో ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోకుండా చూసుకోవాలి.ఇలాంటి చర్యలు దేశ ప్రజలపై, ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.
సహనం లేని వాడు చరిత్రలో నిలవలేడు.అసహనం నియంతృత్వానికి తొలి మెట్టు.
దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులకు అసహనం ప్రబలుతోంది, ప్రశ్నించేవారిని సహించలేక పోతున్నారు.పౌరుల ప్రాధమిక హక్కులు దారుణంగా హరించబడు తున్నాయి.
రాష్ట్రంలో పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని పోలీసు రాజ్యం నడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.సెక్రటరీ నుండి అనేకమంది సీనియర్ ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు దోషులుగా కోర్టులో నిలబడాల్సిన పరిస్థితి.

ఇటీవలకాలంలో ప్రభుత్వం నిరంకుశ పద్ధతులవైపు వెళ్తోంది.ప్రతిపక్షాలు, పౌర సమాజం నిరసన ప్రదర్శన, ధర్నా చేసుకుంటామంటే అనుమతు లివ్వడం లేదని, అధికార పార్టీ నాయకులు మాత్రం ఇష్టారాజ్యంగా ప్రదర్శనలు, కార్యక్రమాలు చేసుకుపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.ఏనాడు లేనంతగా కోర్ట్ మందలింపులకు పోలీసు వ్యవస్థ గురికావడం పోలీసు వ్యవస్థ నిస్పాక్షికతను ప్రశ్నార్థకం చేస్తోంది.కొందరు పోలీసులు అధికార పార్టీ నాయకులు ఆదేశించారనో, ఉన్నతాధికారి చెప్పారనో తమ చర్య చట్ట ప్రకారం ఉందా లేదా అని నిర్ధారించు కోకుండా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్యాయ్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరితే చర్యలు తీసుకోవడం పోయి ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అత్యున్నత పోలీసు అధికారి వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట.చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళితే 151 సి ఆర్ పి సి నోటీసు ఇచ్చి విమానాశ్రయం నుండి వెనక్కి పంపినందుకు అదే అధికారి హైకోర్టు లో సంజాయిషీ ఇచ్చుకున్నారు.
గతి తప్పిన పాలన వలన చీఫ్ ఇక ఎపి సి ఐ డి పనితీరు తీవ్ర విమర్శలకు గురిఅవుతోంది.కేవలం ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తను వాట్సాప్ గ్రూపు లో ఫార్వార్డ్ చేసినందుకు కొల్లు అంకబాబు వంటి నిబద్ధత, నిజాయతీ కలిగిన సీనియర్ జర్నలిస్ట్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకు వెళ్లగలిగిన సి ఐ డి వారు, హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన వారిపై కోర్టు ఆదేశించినా సకాలంలో చర్యలు తీసుకోలేని అశక్తులు ఎందుకు అయ్యారు? అందుచేత సదరు కేసులను హైకోర్టు సి బి ఐ కి అప్పగించడం మన పోలీసు వ్యవస్థకు తలవంపులు కాదా? డాక్టర్ సుధాకర్, అమరావతి దళిత రైతులు మొదలుకుని అనేకమంది సామాన్యులను, విపక్ష నేతలను, పాత్రికేయులను నిర్బంధించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది.పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు పోలీసు అదుపులో ఉన్నపుడు ‘కస్టోడియల్ టార్చర్‘ జరిగిందని న్యాయస్థానం నమోదు చేయడం, న్యాయవాది పైలా సుభాష్ చంద్రబోస్ ను నిర్బంధించిన విధానంపై ” రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? పోలీసు అధికారులు రాజకీయాలు కావాలంటే యూనిఫారం వదిలేసి వెళ్ళాలి – యూనిఫారంలో ఉంటె ప్రజా హక్కులు కాపాడాల్సిందే అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం రాష్ట్రంలో పౌరుల ప్రాధమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయనడానికి నిదర్శనం.
.