దేశవ్యాప్తంగా పార్టీని ఒక ట్రాక్ లో నడిపిస్తూ రోజురోజుకు బలపడుతోంది బిజెపి.తమకు బలం ఉన్న రాష్ట్రాల్లో రోజు రోజుకు మరింత బలపడుతూ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలమైన పార్టీగా ఎదగాలని చూస్తోంది.ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలను బలహీనం చేస్తూ ముందుకు వెళుతోంది.
తెలంగాణలో క్రమక్రమంగా బలం పుంజుకున్నట్టుగా కనిపించింది.దీనికి నిదర్శనంగా తెలంగాణలో కొన్ని పార్లమెంట్ స్థానాలు కూడా బిజెపి తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఏపీలోనూ అదే స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అందుకే అధికార పార్టీ వైసిపి తమతో సఖ్యత గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా బీజేపీ మాత్రం సొంతంగా బలపడాలనే ఆలోచనతో అన్ని పార్టీలను దూరం పెడుతూ వైసీపీని కూడా దూరం పెట్టేలా విమర్శలు చేస్తోంది.
అయితే ఇక్కడే అసలు సమస్యంతా మొదలవుతోంది.
ఏపీ బీజేపీ నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారు.
ఒకరు బీజేపీ స్టాండ్ బలంగా వినిపిస్తుండగా మరో వర్గం వైసిపి కి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తోంది.అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన నాయకులు టీడీపీకి కలిసి వచ్చే విధంగా వైసీపీ పై విమర్శలు చేస్తూ తాము బిజెపి నాయకులు అన్న ఆలోచనలు కూడా మరిచిపోయేలా వ్యవహరిస్తూ పార్టీకి నష్టం చేకూరేలా వ్యవహరిస్తున్నారు.
కీలకమైన విషయాల పై స్పందించే విషయంలోనూ ఏపీ బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడుతూ పార్టీ విధానం ఏంటి అనేదాన్ని గందరగోళంలోకి నెట్టి వేస్తున్నారు.ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తమ అభిప్రాయాలను పార్టీ అభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

తమకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రెస్ మీట్ లు పెట్టేందుకు ఏపీ బీజేపీ నేతలు వెనకాడడం లేదు.ఢిల్లీలో సుజనా చౌదరి, గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ, విజయవాడకు వచ్చినప్పుడల్లా విష్ణువర్ధన్ రెడ్డి, రాజమండ్రిలో సోము వీర్రాజు ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా జగన్ మూడు రాజధానుల విధానంపై బిజెపి నేతలు స్పందిస్తున్నారు.రాజధాని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని సుజనాచౌదరి జగన్ కు గట్టి వార్నింగ్ పంపించారు.
కన్నా లక్ష్మీనారాయణ రాజధాని రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు తప్ప మరే రకమైన విమర్శలు చేయలేకపోయారు.అలాగే విష్ణువర్ధన్ రెడ్డి జగన్ పై విమర్శలు చేశారు.బిజెపి మరో అధికార ప్రతినిధి రమేష్ నాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.విశాఖపట్నంలో ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడి వైసిపి అక్కడ రాజధానిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది అని చెప్పారు.
ఇక సోము వీర్రాజు అయితే జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.జగన్ నిర్ణయం సరైనదే అన్నట్టుగా ఆయన మాట్లాడారు.త్వరలో ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నందున అభివృద్ధి సమాన స్థాయిలో జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.అసలు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి చేయడం వల్లే ఏపీ, తెలంగాణలో విడిపోయాయి అంటూ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు.
ఇలా ఎవరికి వారు తమ తమ సొంత అభిప్రాయాలను పార్టీల అభిప్రాయాలు ప్రకటిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.అయితే కేంద్రం ఈ వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకోవడంలేదు.
జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ పరిస్థితులను అంచనా వేస్తోంది.