గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతూ భాగ్యనగరం అతలాకుతలం అయిపోతున్న విషయం విదితమే.ఈ భారీ వరదల కారణంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా నీటిలో నిండిపోయి అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని తెలంగాణా సర్కార్ కు అందించగా, ఇప్పుడు తాజాగా ఢిల్లీ సర్కార్ కూడా రూ.15 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.ఇటీవల హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది.ఈ క్రమంలో తమ రాష్ట్రానికి ఆర్ధిక సాయం చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణా సర్కార్ కోరగా, ఇప్పుడు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణా కు ఆర్ధిక సాయం అందించడానికి ముందుకు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే నిన్న తమిళ సర్కార్,నేడు ఢిల్లీ సర్కార్ భారీ సాయం అందించాయి.దీనితో ఇరు రాష్ట్రాల సీఎం లకు తెలంగాణా సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.హైదరాబాదులోని సోదర, సోదరీమణులకు ఢిల్లీ ప్రజలు అండగా ఉంటారని తమ ప్రభుత్వం నుంచి కూడా వారికి సాయం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు.కష్ట సమయంలో తెలంగాణకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.
భారీ వరదల కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన హైదరాబాదును ఆదుకునేందుకు సాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తుంది.కేజ్రీవాల్ కు ఫోన్ చేసి కేసీఆర్ మాట్లాడి మరీ కృతజ్ఞతలు తెలిపారు.
వారం రోజులుగాహైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా నగరం మొత్తం కూడా జలమయమైంది.దీనితో పలు కాలనీలు జలదిగ్బంధం లో ఉన్నాయి.
ఈ వరదల కారణంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడినట్లు అయ్యింది.
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా ముంపు ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల చొప్పున అందిస్తామని నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.అంతేగాక, వర్షాల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోతే రూ.లక్ష, అలానే పాక్షికంగా దెబ్బతింటే రూ.50 వేల చొప్పున సాయం అందించనున్నట్లు తెలుస్తుంది.ఈ రోజు నుంచి వరద బాధితులకు సర్కార్ తరఫునుంచి ఆర్ధిక సాయం అందించనున్నారు అధికారులు.