రాజన్న సిరిసిల్ల జిల్లా : శిశువుకు తల్లి పాలే శ్రీరామ రక్ష అని, తల్లి పాల విశిష్టతను వారోత్సవాల కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సిరిసిల్ల సివిల్ ఆసుపత్రిలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తల్లి పాల వారోత్సవాలలోని ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన జిల్లాలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ద్వారా జిల్లాలోని గర్భిణీ స్త్రీలు అందరికీ బిడ్డకు తల్లి పాలు పట్టడం వల్ల కలిగే లాభాలు వివరించాలని, పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలను మాత్రమే ఆహారంగా అందించాలని అన్నారు.
ప్రసవం జరిగిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లి పాలు అందించడం వల్ల బిడ్డ ఎదుగుదలకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదపడుతుందని, ఈ అంశాన్ని విస్తృతంగా గర్భిణీ స్త్రీలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
తల్లి పాల వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం సిరిసిల్ల ఆసుపత్రి ఆవరణ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పారిశుద్యానికి ఆసుపత్రిలో ప్రాధాన్యత కల్పించాలని ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.వసంత రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమీషనర్ లావణ్య, ఆసుపత్రుల సమన్వయ కర్త డా.పెంచలయ్య, ఆర్ఎంఓలు డా.సంతోష్, డా.కాశీనాథ్, వైద్యులు డా.నాగార్జున, డా.సాయి, సీడీపీఓ లు అలేఖ్య, ఎల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.