తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలం జరుగుతున్నా, ఏపీ సీఎం జగన్ టీడీపీ టార్గెట్ గా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నా, టీడీపీలో కీలక నాయకులు అనుకున్నవారంతా బీజేపీ గూటికి వెళ్లిపోతున్నా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏమాత్రం స్పందించడంలేదు.నాలుగుదశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేనంత స్థాయిలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
అసలు ఆ పార్టీ ఓడిన తీరు ఎవరికీ మింగుడుపడడంలేదు.ఇక ఇదే సమయంలో జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు.
ఓ వైపు ప్రజావేదికతో మొదలైన కూల్చివేత పర్వం జిల్లాల్లో కీలక నేతల ఆస్తులకూ పాకింది.అయినా చంద్రబాబు మాత్రం నోరు మెదిపేందుకు ఒప్పుకోవడంలేదు.
ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోయాల్సిన బాబు సైలెంట్ గా ఉంటున్నాడు.

ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఆఫరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీ నాయకులందరినీ పార్టీలో చేర్చుకుని టీడీపీని ఖాళీ చేయించాలని చూస్తోంది.ఇప్పటికే తెలంగాణాలో టీడీపీ నేతలంతా కాషాయ కండువా కప్పేసుకున్నారు.ఇక అక్కడ ఆ పార్టీ ఉనికే లేనట్టుగా ఉంది.
ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలోనూ తీసుకురావాలని బీజేపీ చూస్తోంది.అయినా బాబు మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వడలేదు.
ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ కు విహార యాత్రకు వెళ్లిన బాబు నలుగురు ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించగానే తిరిగి ఏపీకి వస్తారని అంతా భావించారు.కానీ అదేమీ జరగలేదు.
సరిగ్గా అదే రోజు కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కాపు ఎమ్మెల్యేలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు.ఆ తరువాత ప్రజావేదిక కూల్చివేతకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
అయినా చంద్రబాబు ఎక్కడా కనిపించలేదు.
ప్రజావేదిక కూల్చివేత జరుగుతున్న సందర్భంగా దాని వెనుకే ఉన్న తన నివాసానికి వచ్చిన సందర్భంగానూ చంద్రబాబు ఆ విషయం మీద స్పందించలేదు.
ఆ తర్వాత రోజు తీరిగ్గా నేతలతో భేటీ అయ్యి భవిష్యత్ పరిణామాల గురించి చర్చించారు.అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? తాను అత్యవసరంగా స్పందించాల్సిన పరిస్ధితి ఉన్నా, పార్టీకి చెందిన ఇతర నాయకులను ముందు పెట్టి మాట్లాడించడం వెనుక రీజన్ ఏంటో అర్ధంకాక పార్టీ నాయకులు సతమతం అయిపోతున్నారు.ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవడం ఆషామాషీ కాదని, అందుకే వైసీపీపై తాను నేరుగా విమర్శలు చేయకుండా కింది స్థాయి నాయకులతో మాత్రమే విమర్శలు చేయిస్తూ బాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.అలాగే రాబోయే రెండేళ్లలో ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీకీ, వైసీపీకి మధ్య విభేదాలు రావడం ఖాయమని అప్పుడు టీడీపీ కీలకంగా మారే అవకాశం ఉందని బాబు అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందుకే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని బాబు సైలెంట్ గా రాజకీయం చేస్తున్నట్టు అర్ధం అవుతోంది.