ఏదైనా ఒక రాష్ట్రంలో అధికారం మారితే కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ వ్యవహరించే తీరు అందరికీ తెలిసిందే.గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, నిర్ణయాలతో సమీక్ష చేపట్టి ఆ పార్టీకి క్రెడిట్ రాకుండా సరికొత్త పథకాలను ప్రవేశపెట్టడం, లేక పథకాలకు పేర్లు మార్చడం వంటివి చేస్తూ ఉంటాయి.
దీని ద్వారా తమ ప్రభుత్వం వీటన్నిటినీ సమర్థవంతంగా అమలు చేస్తుందని, తాము పెట్టిన పేర్లతోనే పథకాలు అమలు చేయడం ద్వారా తమ పార్టీకి ప్రభుత్వానికి క్రెడిట్ పెరుగుతుందనే ఉద్దేశంతో అన్ని పార్టీలు అధికారంలోకి రాగానే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటాయి.ఇక ఏపీ లోనూ ఇదే పరిస్థితి.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేశారు.అలాగే ఇంకెన్నో పథకాలకు పేర్లు మార్చారు.
ఇది పెద్ద దుమారం రేపినా, జగన్ మాత్రం అవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.అయితే కొద్ది నెలల క్రితం తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే అధినేత స్టాలిన్ సరికొత్త విధంగా రాజకీయాలు చూపిస్తున్నారు.
గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను యధావిధిగా అమలు చేస్తూ, వాటి పేర్లు మార్చకుండా ఆదర్సనీయంగా వ్యవహరిస్తున్నారు.పూర్తిగా అభివృద్ధి పైనే ఆయన దృష్టి పెట్టారు.అసలు ఇది తమిళనాడు రాజకీయాలకు సరిపడని విధానం.ఎప్పుడూ వ్యక్తి పూజ తో అన్నట్లుగానే ఇక్కడ పార్టీలు వ్యవహరిస్తూ ఉంటాయి.
అయితే దానికి భిన్నంగా ముందుకు వెళ్తున్నారు.

ప్రజా ఆమోదమైన నిర్ణయాలు తీసుకుంటూ స్టాలిన్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ముద్ర వేసుకున్నారు.అలాగే బహిరంగ సమావేశాలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు తనను పొగిడినా ఇకపై ఊరుకునేది లేదంటూ బహిరంగ సమావేశంలో స్టాలిన్ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.నిజంగా ఈ తరహా విధానాలను స్టాలిన్ తీసుకోవడం ఆయన చరిష్మాను మరింతగా పెంచింది.
అలాగే మాజీ సీఎం పళని స్వామి ఫొటోతో ఉన్న స్కూల్ బ్యాగులు అధికారులు వెంటనే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.తమ రాజకీయ ప్రత్యర్థి పేరుతో ఉన్న వాటిని పక్కన పడేసి, తన ఫోటోతో ఉన్న బ్యాగులను పంపిణీ చేసుకునే అవకాశం ఉన్నా, స్టాలిన్ ఆ విధంగా చేయకపోవడం ఆయనకు ప్రశంసలు తీసుకువస్తోంది.
గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో పాత్రలకు పేర్లు మార్చుకున్నా, యథావిధిగా అమలు చేస్తున్న తీరు ప్రస్తుత రాజకీయ నాయకులకు, ఎంతో మంది ముఖ్యమంత్రులకు కనువిప్పు కలిగించే అంశమే.ప్రస్తుతానికి స్టాలిన్ ఒక సంచలనమే.