రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లాలోని అన్ని కేంద్రాల్లో గ్రూప్ -2 నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఏఎస్పీ చంద్రయ్య ఆదేశించారు.గ్రూప్ -2 పరీక్షల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అబ్జర్వర్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, చీఫ్ సూపర్ ఇండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, లోకల్ రూట్ ఆఫీసర్లకు గురువారం శిక్షణ ఇచ్చారు.పరీక్ష కేంద్రంలో నిర్వర్తించాల్సిన విధులపై వివరించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం, టీజీ పీఎస్సీ ఆదేశాల మేరకు జిల్లాలో 15-12-2024 ఆదివారం ఉదయం 10.00 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 03.00 నుంచి 05.30 వరకు, 16-12-2024 సోమవారంఉదయం 10.00 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 03.00 నుంచి 05.30 వరకు పరీక్షలు నిర్వహించను న్నామని తెలిపారు.పరీక్షకు మొత్తం 7163 మంది పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు.ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలని స్పష్టం చేశారు.
జిల్లాలో 26 కేంద్రాలు.
ఉదయం 09.30 గంటల తరువాత, మధ్యాహ్నం 02.30 గంటల తరువాత అభ్యర్థులకు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మొత్తం అబ్జర్వర్స్ 26, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 26 చీఫ్ సూపర్ ఇండెంట్స్ 26 ఉన్నట్లు పేర్కొన్నారు.ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పరిశుభ్రత పనులు చేయించాలని, సెస్ అధికారులు కరెంట్ సరఫరాలో లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ఒక రోజు ముందే చూసుకోవాలి
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే తమ పరీక్ష కేంద్ర చిరునామా సరిచూసుకోవాలని పేర్కొన్నారు.బయో మెట్రిక్ అటెండెన్స్ ఉన్నందున అభ్యర్థులు పరీక్ష రోజు నిర్దేశించిన సమయాన్ని కంటే ముందే చేరుకోవాలని సూచించారు.
అభ్యర్థులు తమ గుర్తింపు కార్డులు మినహా ఏమీ వెంట తీసుకురావద్దని పేర్కొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపర్డెంట్లు , ఆర్సీఓ, జేఎన్టీయూ అగ్రహారం కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.