విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( TDP MP Kesineni Nani ) వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.రెండోసారి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి నాని పార్టీ అధిష్టానం పై ఏదో ఒక అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వస్తున్నారు.
పార్టీలో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.అధినేత చంద్రబాబు( Chandrababu ) వద్ద కూడా నాని ఇదే వైఖరితో ఉంటున్నారు.
దీంతో ఆయన బిజెపిలో కానీ వైసీపీలో కానీ చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా తన తమ్ముడు కేసినేని చిన్నికి టిడిపి అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎంపీగా పోటీకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుండడం, క్షేత్రస్థాయిలో చిన్ని కూడా పర్యటనలు చేస్తూ, తానే ఎంపీ అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకోవడం ఇలా ఎన్నో వ్యవహారాలతో నాని ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు.
ఇక తాజాగా నందిగామలో( Nandigama ) జరిగిన మీడియా సమావేశంలో నాని అనేక అంశాలపై స్పందించారు.ముఖ్యంగా తాజా రాజకీయాలపై స్పందించారు .రాజకీయం అర్థం కాకూడదని అర్థం అయితే రాజకీయాలకు పనికిరామని అన్నారు.రాజకీయం అర్థం అయినా పైకి రాలేమని అన్నారు.
రాజకీయంలో లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టుకుంటూ అర్థం కాకుండా వెళ్లాలి అదే రాజకీయం అంటూ నాని వ్యాఖ్యానించారు.ఇక మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో విభేదాల( Soumya ) పైన నాని స్పందించారు.
ఎవరితో తనకు ఎటువంటి విభేదాలు లేవని, సౌమ్యకు నాకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా ? సౌమ్య నేను ఏమైనా ఇసుక , బొగ్గు, మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నామా ? కాంట్రాక్టులు కలిసి చేస్తున్నామా ? కాంట్రాక్టర్ల దగ్గర తామిద్దరం డబ్బులు దోచుకునేందుకు ప్లాన్ చేసుకుంటామా అంటూ నాని ప్రశ్నించారు.సౌమ్య తాను మంచి మనుషులమని, మేమిద్దరం క్లీన్ పీపుల్ అంటూ వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం నాని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మళ్లీ టిడిపి అధిష్టానానికి దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు చిన్నికి టికెట్ ఇచ్చే అవకాశం ఉండడం, దీనికి తగ్గట్లుగానే చిన్ని కూడా యాక్టివ్ గా టిడిపి( TDP ) కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం వంటి కారణాలతో , నాని మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వడమే కాకుండా, పార్టీ నాయకులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రస్తుత వ్యవహారం చూస్తే అర్థమవుతుంది.