తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని లక్ష్యంతో రేవంత్ ముందుకు వెళుతున్నారు.
సీనియర్ నాయకుల నుంచి తగిన సహకారం లేకపోయినా, ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిత్యం జనాల్లో ఉంటూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో రేవంత్ పనిచేసుకుంటూ వెళ్తున్నారు.ప్రస్తుతం హత్ సే హత్ జోడో యాత్ర పేరుతో రేవంత్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ యాత్రకు ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది.కాంగ్రెస్ సీనియర్ల నుంచి తగిన సహకారం లేకపోయినా, భారీగా జనాలు రేవంత్ పాదయాత్రకు హాజరవుతుండడం, ఆయన నిర్వహిస్తున్న సభలను భారీగా జనాలు హాజరవుతుండడం పై జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే రేవంత్ పాదయాత్రకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ కల్పించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం రేవంత్ పాదయాత్ర మారుమోగుతోంది.క్షేత్రస్థాయిలో ఈ స్థాయిలో రేవంత్ పాదయాత్రకు ఆదరణ లభిస్తుండడం మిగతా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది.స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలే రేవంత్ యాత్రకు వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.రేవంత్ పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేమి పనిచేయలేదు.
రేవంత్ యాత్రకు తమ నియోజకవర్గాల్లోనూ భారీగా జనాలు , పార్టీ కార్యకర్తలు తరలి వెళ్తుండడం, వంటివి కాంగ్రెస్ సీనియర్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
తాము యాత్రలు నిర్వహిస్తే , కార్యకర్తలను రప్పించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు స్వచ్ఛందంగా తరలి వెళ్తుండడం చూస్తుంటే రేవంత్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఇప్పటివరకు తాము గ్రహించలేకపోయామని సీనియర్లు సైతం ప్రశంసిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ను విస్తరించడంలో రేవంత్ చాప కింద నీరులా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.