సాధారణంగా వర్షాకాలంలో రహదారుల పక్కన నడుస్తున్నపుడు ఒకింత టెన్షన్ కలుగుతుంది.ఎందుకంటే రోడ్డుపైన చిన్న చిన్న గుంటల్లో వున్న వర్షపు నీరు వాహనాలు తిరుగుతున్నప్పుడు మనపైన ఎక్కడ కుమ్మరిస్తాయో అని భయపడిపోతుంటాం.
అయితే అదే కుంటల్లోని నీటిని కోరి వాహనదారులు వెళ్ళేటప్పుడు మా ఒంటిపైన కుమ్మరించండి అని ఎవరైనా కోరుకుంటారా? కానీ ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో అదే జరిగింది.కావాలనే ఆ నీటిని తమ ఒంటిపైన పడేలా వాహనదారులను ప్రోత్సహించారు ఆ బాటసారులు.
పైగా వారు వయస్సులో చాలా పెద్దవారు.అయితే సడెన్ గా వారిలోని చిన్నపిల్లవాడిని మేల్కొలిపారు వారు.నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలోని వున్న ముగ్గురూ నడి వయసులో కూడా చిన్నతనంలో ఆడినట్లుగా రోడ్డు మీద షర్ట్ తీసేసి మరి నీళ్లల్లో ఆడుకోవడం ఇక్కడ మనం చూడవచ్చు.అలా రోడ్డు మీద ఉన్న నీళ్లపై కార్లు వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు తమపై పడడాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు.
ఇంకా రోడ్డు మీదుగా వెళ్లే కార్లను తమపై నీళ్లు పడేలా నడపమని సైగలు చేయడం కొసమెరుపు.
‘డంకన్ కుకార్డ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఒక అమ్మాయితో పాటు నల్లటి షార్ట్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి ఉండటం మనం గమనించవచ్చు.
‘స్ప్లిష్ స్ప్లాష్’ బాబీ డారిన్ అనే పాటతో వచ్చిన ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారనేది మాత్రం తెలియదు కానీ నవంబర్ 20న పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకూ కోటి 90 లక్షలకు పైగా వీక్షించడం విశేషం.ఇంకా తొమ్మిది లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.
ఓ నెటిజన్ ‘ఎలా ఆనందించాలో బాగా తెలిసినవారు వీరు’ అని కామెంట్ చేశాడు.