కెనడాలో నానాటికీ విద్వేషదాడులు తీవ్రమవుతోన్న నేపథ్యంలో ఆ దేశంలో వున్న భారతీయులు అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేయడం ఇరు దేశాల్లో తీవ్ర చర్చకు కారణమవుతోంది.ఈ నేపథ్యంలో అసలు కెనడాలో ప్రస్తుత పరిస్ధితులు ఎలా వున్నాయో ఒకసారి చూస్తే… స్టాటిస్టిక్స్ కెనడా అందించిన డేటా ప్రకారం 2014 నుంచి దేశంలో మొత్తం ద్వేషపూరిత నేరాల సంఖ్యలో 159 శాతం పెరుగుదల నమోదైంది.
ఆగస్ట్‌లో స్టాటిస్టిక్స్ కెనడా ప్రచురించిన నివేదిక ప్రకారం… టొరంటో (779), వాంకోవర్ (429), మాంట్రియల్ (260), ఒట్టావా (260), కాల్గరీ, (139) నగరాలలో 2021లో అత్యధిక సంఖ్యలో ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.అలాగే జాతి ఆధారిత విద్వేషనేరాలు కూడా 2014 నుంచి పెరిగాయి.ఈ తరహా నేరాలలో 182 శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.2020 నుంచి ద్వేషపూరిత నేరాలలో 27 శాతం పెరుగుదల నమోదైంది.
కెనడియన్ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ కమ్యూనిటీ సేఫ్టీ స్టాటిస్టిక్స్ నివేదిక 2021 ప్రకారం.యుకాన్ మినహా మిగిలిన అన్ని కెనడా ప్రావిన్సుల్లోనూ ద్వేషపూరిత నేరాలు పెరిగినట్లు నివేదించింది.
మతం (67 శాతం పెరుగుదల), లైంగిక వివక్ష (64 శాతం పెరుగుదల) లక్ష్యంగా చేసుకుని కూడా ద్వేషపూరిత నేరాలు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.జాతి విద్వేష నేరాలకు సంబంధించి 2021లో దక్షిణాసియా జనాభాను లక్ష్యంగా చేసుకున్న ఘటనల్లో 21 శాతం పెరుగుదల నమోదైంది.2019లో ఈ తరహా ఘటనలు 81 శాతం పెరిగితే.2021లో అవి 164 శాతం పెరిగాయి.ఇక అరబ్ లేదా పశ్చిమాసియా జనాభాను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు 46 శాతం, ఆగ్నేయాసియాను జనాభాను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు 16 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
ఇకపోతే.సిక్కులకు ప్రత్యేక దేశం ‘ఖలిస్తాన్’ అంశానికి సంబంధించి సిక్కు వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’ రెఫరెండానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారతదేశం కెనడాలో వున్న తన పౌరుల భద్రతను దృష్టిలో వుంచుకుని అడ్వైజరీ జారీ చేసింది.కెనడాలో భారతీయ మూలాలున్న వారు, ఎన్ఆర్ఐలు కలిపి 1.6 మిలియన్ల మంది నివసిస్తున్నారు.