యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలని,కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ హక్కులను కాలరాస్తుందని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల పట్టణంలో మంగళవారం ముదిరెడ్డి సుధాకర్ రెడ్డ్ అధ్యక్షతన జరిగిన సిపిఎం నల్లగొండ,యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీల సంయుక్త సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చే పనిలో నరేంద్ర మోడీ నిమగ్నమయ్యారని ఆరోపించారు.
ఓట్లేసి గెలిపించిన ప్రజల యొక్క తీర్పులకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలని కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు.కేంద్రంలోని మోదీ సర్కార్ అదానీ,అంబానీ వంటి కార్పొరేట్‌శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.పరిశ్రమలు, ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే సంపదంతా వారి వద్దే కేంద్రీకృతమవుతుందన్నారు.
దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు,పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి,నల్లగొండ,యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శిలు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,మహ్మద్ జహంగీర్,రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య,కొండమడుగు నర్సింహ,డబ్బికార్ మల్లేశం,జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.