మత్స్యకారుల అభ్యున్నతి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన మత్స్యకార అభ్యున్నతి పాద యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన రాష్ట్ర నాయకులు బొమ్మిడి నాయకర్ మామిడి కుదురు మండలం గోగన్నమఠంలో పర్యటించారు.
ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.
ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఏమి చేయడం లేదని, గత కొంత కాలంగా వేట తగ్గి పోయిందని, కేవలం ప్రభుత్వం పది వేలు మాత్రమే ఇస్తుందని, కొన్ని సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని చెబుతున్నారన్నారు.ప్రభుత్వ జీవో 217 వలన కూడా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
మత్స్యకారులు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం, కేవలం కేంద్రం ఇచ్చే ఐదు లక్షలనే ఇస్తుందన్నారు.అది కూడా కేవలం 63 మందికే ఇవ్వడం జరిగిందన్నారు.
ఇప్పటి కిప్పుడు ఎన్నికలు లేకపోయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారని, 20వ తారీఖున నర్సాపురం లో జరిగే సభలో మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తారన్నారు.రాష్ట్ర నాయకులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.
మత్స్యకారుల అంటే అధినేత పవన్ కళ్యాణ్ కు ఎనలేని అభిమానం అని, జనసేన పార్టీ పెట్టినప్పుడు శ్రీకాకుళంలోని గంగపుత్రుల వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి కార్యచరణ ప్రారంభించారన్నారు.