ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఏపీ సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు.తాను అనుకున్న నిర్ణయాన్ని అనుకున్నట్టుగా అమలు చేస్తున్నారు.
విపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు.ప్రభుత్వం ఏర్పడిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ విషయంలోనూ జగన్ వెనక్కి తగ్గేందుకు ఇష్టపడలేదు.
సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని అమలు చేసి చూపించారు.కొన్ని కొన్ని విషయాల్లో జగన్ తన నిర్ణయాలను అమలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న, అంతిమంగా మాత్రం వాటిని అమలు చేసే వరకు ఆయన వదిలి పెట్టే రకం కాదు.
జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాల్లో మూడు రాజధానులు అంశం ఒకటి.విశాఖ, కర్నూలు ,అమరావతిని దీనికోసం ఎంచుకున్నారు.
దాదాపు మూడు రాజధానుల నిర్ణయం పూర్తిస్థాయిలో అమలు అవుతుంది అనుకున్న సమయంలో కోర్టు చిక్కులు రావడం తో తాత్కాలికంగా జగన్ వెనక్కి తగ్గారు.
మూడు రాజధానులు బిల్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో తమ పోరాటం వల్లే జగన్ వెనక్కి తగ్గారు అనే వెక్కిరింపులు విపక్షాలు చేశాయి.అయితే జగన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లు సిద్ధం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.ప్రతి పక్షాలు ఒప్పుకున్నా , ఒప్పుకోక పోయినా మూడు రాజధానుల బిల్లు అమలు చేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని సైతం మీడియా ముందు ప్రకటించారు.
ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉండడంతో మూడు రాజధానులు బిల్లు అమలుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.ఇక జగన్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.
ఈ ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు, అధికారిక కార్యకలాపాలు మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలు వచ్చినా, అంతా ప్రశాంతంగానే ఉంది.ఈ విషయంలో ప్రతి పక్షాలు పోరాటం చేసేందుకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది.కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటనే విషయాన్ని విపక్షాలు చెప్పలేక పోతున్నాయి.
అక్కడక్కడ జిల్లాల పేర్లు మార్చాలంటూ టిడిపి నేతలు స్థానికంగా ఆందోళనలు చేయడం మినహ, కొత్త జిల్లాల ఏర్పాటు ను వ్యతిరేకించలేని పరిస్థితి టీడీపీకి ఉంది.ఈ విధంగా ఎక్కడి కక్కడ విపక్షాలకు అవకాశం దొరక్కుండా జగన్ నిర్ణయాలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు.