దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో దక్షిణాఫ్రికా రావణ కాష్టంలా మండుతోంది.ప్రావిన్సుల్లో జరుగుతోన్న ఈ ఆందోళన కార్యక్రమాలు.
చివరకు అల్లర్లు, దోపిడీలకు తెరతీశాయి.దీంతో గౌటెంగ్, క్వాజులు-నాటాల్ ప్రావిన్సుల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలు, తదితర ఘటనల్లో ఇప్పటివరకు 72 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న సమయంలోనే ఈ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.ఆందోళనల ముసుగులో కొందరు నిరసనకారులు ఆహారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, మద్యం, వస్త్రదుకాణాలు, షాపింగ్ మాల్స్‌పై దాడి చేసి వాటిని లూటీ చేస్తున్నారు.దీంతో పోలీసులు, సైన్యాన్ని రంగంలోకి దించినప్పటికీ దేశంలో పరిస్థితులు కుదుటపడటం లేదు.
2009 నుంచి 2018 వరకు తొమ్మిదేళ్లపాటు దేశాధ్యక్షుడిగా ఉన్న జాకబ్ జుమాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.దర్యాప్తు కమిషన్ ముందు హాజరు కావాలని జుమాను ఆదేశించింది.కానీ కోర్ట్ ఆదేశాలను ఆయన పెడచెవిన పెట్టారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.
కోర్టు ధిక్కరణ నేరం కింద 15 నెలల జైలు శిక్ష విధించింది.అలాగే తక్షణం పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
గత్యంతరం లేని పరిస్థితుల్లో జుమా జైలుకు వెళ్లి లొంగిపోవాల్సి వచ్చింది.దీనిని జీర్ణించుకోలేని ఆయన మద్ధతుదారులు, ప్రజలను పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.
ఇంతటి కల్లోలానికి కారణం జాకబ్ జుమాతో పాటు మన భారతీయ సోదరులైన గుప్తా బ్రదర్స్ అవినీతే కారణం.

జాకబ్ జుమాతో సాన్నిహిత్యం ద్వారా గుప్తా సోదరులైన అజయ్, అతుల్, రాజేశ్‌లు బిలియన్ డాలర్ల విలువైన అక్రమాలకు పాల్పడ్డారని ఎన్‌పీఏ దర్యాప్తులో తేలింది.జుమా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గుప్తా బ్రదర్స్ రాజకీయాల్లోనూ తమ హవా కొనసాగించారు.అధ్యక్షుడితో సత్సంబంధాలు పెంచుకున్న వీరు కేబినెట్‌లో ఎవరు ఉండాలి? ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి? అన్న విషయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్నారు.గుప్తా బ్రదర్స్‌ది యూపీలోని షహరాన్‌పూర్. స్థానిక రాణి బజార్‌లో వీరి తండ్రి శివకుమార్‌కు రేషన్ షాపు ఉండేది.వీరిని స్థానికులు ఇప్పటికీ ‘రేషన్ షాపోళ్లు’ గానే పిలుస్తుంటారు.తండ్రి స్మారకార్థం ఓ దేవాలయాన్ని నిర్మించిన గుప్తా బ్రదర్స్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఇక్కడి శివరాత్రి ఉత్సవాలకు హాజరవుతారు.

1985లో గుప్తా కుటుంబం రాణి బజార్ నుంచి తన మకాంను ఢిల్లీకి మార్చింది.1993లో అక్కడి నుంచి దక్షిణాఫ్రికాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన జొహన్నెస్‌బర్గ్‌కు వలస వెళ్లారు.అక్కడ వ్యాపారం ప్రారంభించిన గుప్తా బ్రదర్స్ అనతికాలంలోనే మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.మైనింగ్, మీడియా, ఇంజినీరింగ్ ప్రాజెక్టులు.ఇలా ప్రతీ రంగంలోనూ వీరి హవా కొనసాగింది.ఈ అన్నదమ్ములకి మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా కుటుంబం అండగా నిలిచింది.2009లో జుమా ఏకంగా అధ్యక్షుడు కావడంతో దేశంలో గుప్తా బ్రదర్స్‌కు ఎదురు లేకుండా పోయింది.ఆయన అండతో వీరు కోట్లాది రూపాయలు సంపాదించి.
దక్షిణాఫ్రికాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది.